జిజిహెచ్‌లో తగ్గని రద్దీ

Feb 10,2024 00:01

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఆస్పత్రి ప్రాంగణంలో 11 ఓపి రిజిస్ట్రేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేసినా తగినంత సిబ్బందిని నియమించకపోవడం వల్ల రోగులు ఎక్కువ సేపు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సిబ్బంది నియామకంలో అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టరుకు ఇటీవల సూపరింటెండెంట్‌ నోటీసులు జారీచేసినా స్పందన లేదు. ఆస్పత్రిలో పార్కిరగ్‌ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆస్పత్రిలో రక్షణ చర్యలకు సెక్యూరిటీ విభాగం పర్యవేక్షణా కొరవడింది. ఆసుపత్రి ఓపీకి ప్రతిరోజు రోగులు మూడు వెల నుంచి నాలుగు వేలమంది వస్తున్నారు. రోగులతో పాటు వారి సహాయకులు కూడా మరో నాలుగు వేలమందికి పైగా వస్తున్నారు. పరీక్షలకు వెళ్లడానికి ఒక్కడే వెళ్లలేని పరిస్థితిలో సహాయకులను తెచ్చుకోవడం అనివార్యంగా మారుతోంది. నడవలేని, అపస్మారస్థితిలో ఉన్న రోగులను ఒక వార్డునుంచి మరో వార్డుకు, పరీక్షలకు తీసుకువెళ్లాలన్నా నాల్గో తరగతి ఉద్యోగులు సహకరించని పరిస్థితుల్లో సహయకులు వెంట ఉండక తప్పని స్థితి నెలకొంది. ఒక రోగికి పరిస్థితిని బట్టి ఒకరు ఇద్దరు సహాయకులు రావాల్సిన పరిస్థితి నెలకొంది. రక్తపరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్‌ తదితర అవసరాల కోసం ప్రతి రోగికి ఒక సహాయకుడు అనివార్యంగా ఉంటున్నారు. వార్డు బార్సు వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. అంబులెన్సు నుంచి వచ్చిన రోగిని కూడా వారి బంధువులే ఆస్పత్రి క్యాజువాలిటీకి, అక్కడ నుంచి వార్డులకు తీసుకువెళ్లక తప్పడం లేదు. వార్డుల్లో రోగితో పాటు సహాయకులు కూడా వైద్యుడి వద్దకు వెళ్తుండటం వల్ల క్యూలైన్లలో రద్దీ కన్పిస్తుంది. ఉదయం 8 గంటలకే ఓపీ కేంద్రం వద్ద రోగులు తండోపతండాలుగా వస్తుందటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. ఓపీ కౌంటర్ల వద్ద కేవలం ఐదారుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులలో ఉంటున్నారు. 11 రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌లలో 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉంది. ప్రింటర్లులు అందుబాటులో ఉంచాల్సి ఉండగా కాంట్రాక్టర్లు సిబ్బందిని, ప్రింటర్లను ఉంచడం లేదని చెబుతున్నారు. అరకొర సిబ్బందిని నియమించి తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపీ కేంద్రం తెరిచి ఉండాల్సి ఉండగా మధ్యాహ్నం తరువాత సిబ్బంది సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. పార్కింగ్‌ స్థలంలో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా వాహనాల రక్షణకు తగిన చర్యలు లేవు. తగినంత సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం లేదు.
ముగ్గురు కాంట్రాక్టర్లకు నోటీసులు : సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌
ఆసుపత్రిలో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చాం. రోగుల సౌకర్యం కోసం ఓపీ కేంద్రాల వద్ద రూ.20 లక్షలతో రేకుల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా 11 ఓపి కేంద్రాలను ప్రారంభించాం. రద్దీని నియంత్రించి వీలైనంత త్వరగా రోగులకు చికిత్స అందించి త్వరిత గతిన వారిని ఇంటికి పంపేందుకుచర్యలు తీసుకుంటున్నాం.

➡️