జిల్లాలో తగ్గిన నేరాల సంఖ్య

Dec 27,2023 23:23
సుమారు 18 శాతం

ప్రజాశక్తి – కాకినాడ

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య సుమారు 18 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవగాహన కార్యక్రమాలు, నాటు సారాను ధ్వంసం చేయడం, వారిపై కేసులు పెట్టడం వల్ల నేరాల సంఖ్య తగ్గిందన్నారు. 2022లో 8549 కేసులు నమోదు కాగా 2023లో 7019 కేసులు నమోదైనట్లు తెలిపారు. 702 పేకాట, కోడిపందాలు కేసుల్లో 2655 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.42 లక్షల 70 వేల 208ల సొత్తుతోపాటుగా, 45 కోడిపుంజులు, 134 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి నేరాలపై 2022తో పోలిస్తే 2023లో 38 శాతం కూడా తగ్గాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిందని 2022లో 4,412 కేసులు నమోదు చేయగా 2023లో 10,505 కేసులు నమోదు నమోదు చేసినట్లు చెప్పారు. కోడిపందాలు, పేకాట గంజాయి వంటి అమ్మేవారిపైన, నిర్వహించే వారిపై చర్యలు చేపట్టి పీడీ యాక్ట్‌ను నమోదు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 35 వాహనాలను, 2069 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. 2024 సంవత్సరంలో తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించడం, పిడి చట్టం, బహిష్కరణ ద్వారా రౌడీ మూకలపై కఠిన చర్యలు, 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ, ఇంటి దొంగతనాల నివారణ, దొంగలిం చబడిన సొత్తును రికవరీ చేయడం వంటి అంశాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 31, 2024 జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్‌పి పి.శ్రీనివాస్‌, కాకినాడ డిఎస్‌పి పి.మురళీకృష్ణా రెడ్డి, పెద్దాపురం డిఎస్‌పి కె.లలితా కుమారి పాల్గొన్నారు.

➡️