జీతాలు ఇవ్వకుంటే బతికేదెలా?

Feb 20,2024 21:41

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఇటీవల సమ్మె సందర్భంగా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాత పూర్వకంగా ఇచ్చిన హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని, ఆప్కాస్‌లో లేని కార్మికులకు థర్డ్‌ పార్టీ విధానం రద్దు చేసి, నగరపాలక సంస్థ నేరుగా జీతాలు చెల్లించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎ.జగన్మోహన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలలు తరబడి జీతాలు ఇవ్వక పోతే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక కానుక రూ’.1000 వెంటనే ఇవ్వాలన్నారు. 2 నెలలు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు, 3ఏళ్ల సరెండర్‌ లీవ్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంప్‌ హౌస్‌, లీకుల్లో పనిచేసే కార్మికులకు 2 నుంచి 6 నెలలు బకాయి జీతాలు చెల్లించాలని, బట్టలు, సబ్బులు, నూనెలు, చెప్పులు తదితర రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.వాటర్‌ వర్క్స్‌, పంప్‌ హౌస్‌ కార్మికులకు సర్వీస్‌, అర్హతను బట్టి స్కిల్‌, సెమి స్కిల్‌ వేతనాలు చెల్లించే విధంగా రీజనల్‌ డైరెక్టర్‌కు ప్రతిపాదన పంపాలన్నారు. విలీన ప్రాంత కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అమలు చేయాల డిమాండ్‌ చేశారు.ధర్నాలో అప్పలరాజు, సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, వరలక్ష్మి, బాబురావు, జగదీష్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️