జీతాలు పెంచాలని ఆయాల ధర్నా

Mar 12,2024 21:25

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శానిటేషన్‌ వర్కర్ల జీతం రూ.6వేలు నుంచి రూ.12వేలుకు పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆయాలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఎ. జగన్మోహన్‌రావు, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బేగం, నందిని మాట్లాడుతూ పార్ట్‌ టైం వర్కర్‌ అని చెప్పి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫుల్‌ టైం వర్కర్లుగా పనిచేస్తున్నారని అన్నారు. తరగతి గదులను , బాత్రూములను శుభ్రం చేయడంతో పాటు పిల్లలను కంట్రోల్‌ చేయటం, టీ మంచినీళ్లు, రికార్డులను అందించడం, జిరాక్సులు తీయించడం తదితర పనులు చేస్తున్నారని తెలిపారు. వారందరినీ ఫుల్‌ టైం వర్కర్లుగా గుర్తించి జీతం రూ.12వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు కార్తీక్‌కు వినతినిచ్చారు. కరోనా కు ముందు నుంచి 2020 వరకు ఒక్కొక్క ఆయాకు కనీసం 6 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు నెలకు రూ. 2వేలు చొప్పున జీతం బకాయి ఉందని, స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు పలుమార్లు విన్నవించిన నేటికీ వర్కర్లకు డబ్బులు పడలేదని, సమగ్ర విచారణ చేసి జీతాలు చెల్లించాలని జెసిని కోరారు. సిక్‌ లీవ్‌లు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ధర్నాకు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు జి.కుమారి మద్దతు ప్రకటించారు.

➡️