జెకెసికి 201 వినతులు

Feb 12,2024 20:51

 ప్రజాశక్తి-విజయనగరంకోట  : జగనన్నకు చెబుదాం (జెకెసి)లో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్‌లైన్‌లో పంపిన వినతులను పరిశీలించి, వాటిపై స్పందించాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జెసి కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, కెఆర్‌ఆర్‌సి డిప్యూటీ కలెక్టర్‌ సుమబాల, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్‌రావుతో కలిసి జిల్లా కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 201 వినతులు అందాయి. రెవెన్యూ శాఖ సమస్యలపై 144 , డిఆర్‌డిఎకు 6, గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు 11, జిల్లా పంచాయతీ విభాగానికి 15, గృహనిర్మాణ శాఖకు 5, జిల్లా ఆసుపత్రులకు సంబంధించి 3, ఎపి విద్యుత్‌ పంపిణీ సంస్థకు సంబంధించి 3 వినతులు, మున్సిపల్‌ శాఖకు 12 చొప్పున వినతులు అందాయి.నిబంధనల మేరకు మినహాయింపులు ఎన్నికల విధుల నుంచి ఎవరిని మినహాయించాలో ఎన్నికల విభాగం వారు నిర్ణయిస్తారని కలెక్టర్‌ నాగలక్ష్మి స్పష్టంచేశారు. వాస్తవ పరిస్థితులను మాత్రమే మినహాయింపులకు తీసుకుంటారని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అనంతరం అధికారులతో ఆమె మాట్లాడారు. చాలామంది అధికారులు ఎన్నికల విధుల నుండి మినహాయింపులు కోరారని తెలిపారు. రెగ్యులర్‌గా విధులకు హాజరవుతున్న వారిని వారి వాస్తవ పరిస్థితి ఆధారంగా మినహాయిస్తారని చెప్పారు. బాలింతలను 3 నెలల వరకు , వికలాంగులకు 75 శాతం పైబడిన వారికీ మినహాయిస్తారని తెలిపారు. రిటైర్మెంట్‌కు 3 నెలల తర్వాత వారికీ మినహాయింపు ఉండదని, జూన్‌ 30 లోపు రిటైర్‌ అయ్యే వారికే ఎన్నికల విధుల నుండి మినహాయిస్తామని తేల్చిచెప్పారు. వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల నియామకానికి మార్చి 31 లోపు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెలాఖరు లోపు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్లు ఇవ్వకుండానే రుణాలు వసూలు అన్యాయం’

మాకు టిడ్కో ఇళ్లు ఇవ్వకుండానే బ్యాంకులు మా దగ్గర నుంచి రుణాలు వసూలు చేయడం అన్యాయం.బ్యాంకుల నుంచి రుణ విముక్తి కల్పించండి’ అంటూ నెల్లిమర్లలోని నాయుడు కాలనీకి చెందిన కొత్తకోట్ల వసంతకుమారి, కలిశెట్టిి చంద్రమ్మ అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పలువురు తమ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో తమకు ఇళ్ల అనుమతులు వచ్చాయని, అందుకు కొంత మొత్తం కట్టామని తెలిపారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆర్‌పిలు తమను మీటింగ్‌కు తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకున్నారని, అప్పటి నుంచి తమ బ్యాంకు ఖాతాల నుంచి నెలకు రూ. 2950 కోత పెడుతున్నారని తెలిపారు. తమకు ఇల్లు రాకపోగా, వాడుకోకుండానే రూ.3.50లక్షలకు వడ్డీ కట్టడం ఏమిటని ప్రశ్నించారు. తమకు ఇళ్లు వద్దని, తాము కట్టిన డబ్బులు ఇప్పించాలని కోరారు. నా భూమి నాకు అప్పచెప్పండివిజయనగరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన కోరాడ పైడిరాజు.. తన భూమిని అన్యాయంగా అక్రమణ చేసి రిజిస్ట్రేషన్‌ చేసేశారని, ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి వారి నుంచి తన భూమిని తనకు ఇప్పించాలని అధికారులను కోరాడు.

– నగరంలోని బొగ్గులదిబ్బ ఎస్‌సి కాలనీలో ఇళ్లు తొలగించిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం మండలం జొన్నవలసలో బిసి బాలుర వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని టిడిపి నాయకులు కలెక్టర్‌ను కోరారు. వినతినిచ్చిన వారిలో ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, కనకల మురళీమోహన్‌, ముద్దాడ చంద్రశేఖర్‌, విజ్జపు ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

➡️