జోలె పట్టిన అంగన్వాడీ అమ్మ

ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరింది. ఇన్ని రోజులుగా తాము పోరాడుతున్నా ప్రభుత్వం స్పందిం చడం లేదని, తమ విస్మరించడం ద్వారా రోడ్డుపైకి నెట్టిందని అంగ న్వాడీలు ఆవేదనకు గురయ్యారు. అయినా తాము వెనక్కు తగ్గబో మని, ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. తమ పోరాటానికి మద్దతుగా నిలవాలని ప్రజల్ని కోరుతూ భిక్షాట న చేపట్టారు. పలు సమ్మె శిబిరాల వద్ద వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు.
పట్టణంలోని ప్రధాన వీధుల్లో అంగన్వాడీలు భిక్షాటన చేపట్టారు. తమకు అనేక హామీలు ఇచ్చిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చివరికి తమ బతుకుల్ని రోడ్డు మీద పడేశారంటూ ప్రజలవద్దకెళ్లి జోలె పట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి మాట్లాడుతూ మహిళా సాధికారతను తామే సాధిస్తామని చెప్పే సిఎంకు అంగన్వాడీల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. శాంతియుత్తంగా సమ్మె చేస్తుండగా ప్రభుత్వం మాత్రం కేంద్రాల తాళాలు పగలగొట్టిస్తోందని, అయినా ఒక్క గర్భిణికి అయినా, బాలింతకైన, పిల్లలకైనా ముద్ద అన్నం వండి పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రభుత్వం బేషజాలు వీడాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రూ.26 వేల కనీస వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని కోరారు. అప్పటి వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మె శిబిరాన్ని ఎపిఎఫ్‌టియు న్యూ నాయకులు వి.రాంబాబు, బీసి సంఘం నాయకులు ఎడవల్లి కొండలు, కోటేశ్వరరావు, కొక్కెర కొండలు, మైనార్టీ నాయకులు సయ్యద్‌ ఖాసిం సైదా, శ్రీను సందర్శించి మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు బి.నాగేశ్వరరావు, సీతారా మయ్య, షేక్‌ బాబు, అంగన్వాడి నాయకులు డి.శాంతమణి, హజ్రా, పద్మ సుహాసిని, సుజాత, శివరంజని, ఊర్మిళ, కవిత పాల్గొన్నారు.

ప్రజాశక్తి – వినుకొండ :

స్థానిక నరసరావుపేట రోడ్డు సురేష్‌ మహల్‌ వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీల పట్ల అనుచితంగా మాట్లాడిన సినీ దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. ఎఎల్‌ ప్రసన్నకుమారి, శారమ్మ, ఎ.ఆంజనే యులు, బి.కోటయ్య, జి.పద్మ, షేక్‌ మున్ని, పి.ఉమా, శంకరి, శ్రీదేవి, కృష్ణకుమారి, ప్రసూనాంబ, విజయ కుమారి పాల్గొన్నారు.

ప్రజాశక్తి-ముప్పాళ్ల :

అంగన్వాడీల సమస్యలను పరిష్కరిం చడానికి బదులు సమ్మె విచ్ఛిన్నం కోసం ప్రభుత్వం యత్నిస్తోందని, కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులతో పగలగొట్టించడాన్ని తాము ఖండిస్తున్నామని సిఐటియు, రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక, మహిళా సంఘాల నాయకులు చెప్పారు. మండలంలోని నార్నెపాడులో ఆయా సంఘాల నాయకులు అంగన్వాడీలతో కలిసి కేంద్రాల వద్దకెళ్లారు. సచివాలయ ఉద్యోగులు తెరిచిన కేంద్రాలను మూసేయాలని డిమాండ్‌ చేశారు. వాటిల్లో విధులు నిర్వహిస్తున్న ఎఎన్‌ఎం, ఆశా కార్యక ర్తలతో మాట్లాడి వారి విధులను సచివాలయం నుండి నిర్వహించుకోవాలని, అంగన్వాడీ కేంద్రా లకు రావొద్దని కోరారు. పిల్లలెవరూ లేకుండా కేంద్రంలో కూర్చున్న సచివాలయ ఉద్యోగిని బయటకు పంపి ఆ కేంద్రానికి తాళం వేశారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి జి.రజిని, ప్రజా సంఘాల నాయకులు టి.అమర లింగేశ్వరరావు, ఐ.శివ, సైదాఖాన్‌, కె.ప్రభాక ర్‌రావు, ఎన్‌.సాంబశివరావు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-సత్తెనపల్లి :

పట్టణంలో అంగన్వాడీలంతా రెండు బృందాలుగా ఏర్పడి భిక్షాటన చేశారు. ఇటీవల అంగన్వాడి కేంద్రాలను తాళాలు పగలగొట్టి తెరిచిన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకో వాలని కోరుతూ మున్సిపల్‌ రెవెన్యూ అధికారి అప్పారావుకు వినతిపత్రం ఇచ్చారు. యూని యన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు జి.సుజాత, ఎస్‌.అహల్య, చాముండేశ్వరి, భవాని, ధనలక్ష్మి, అంజలి, జ్యోతి, సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు జె.రాజకుమార్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట :
పట్టణంలోని పండరిపురంలో సిఐటియు కార్యాలయం నుండి చౌత్రా సెంటర్‌ మీదుగా కళా మందిర్‌ సెంటర్‌ వరకూ భిక్షాటన చేశారు. న్యాయమైన అంశాలపై పోరాడుతున్న తమకు మద్దతివ్వాలని ప్రజలను కోరగా విశేషంగా ఆదరించారు. యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్ష కార్యదర్శులు జి.సావిత్రి, కె.రమాదేవి, సిఐటి యు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లా డారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ప్రభుత్వం దిగి వచ్చేదాకా సమ్మెను విరమించబోమని హెచ్చరించారు. మాటతప్పను.. మడిమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మొద్దు నిద్ర నటిస్తున్నారని, ఆ మత్తును వదిలించే వరకూ పోరాడతామని ఉద్ఘాటించారు. కార్యక్ర మంలో యూనియన్‌ నాయకులు ఎ.పద్మ, శారదా, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ నాయకులు ఎస్‌.లూథర్‌, ఎస్‌.బాబు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-క్రోసూరు :

సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్య క్షులు జి.రవిబాబు సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చల సందర్భంలో డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుండా ముందు సమ్మె విరమించాలని చెప్పడం విడ్డూరమన్నారు. ఉమ్మడి సమస్యలతోపాటు వ్యక్తిగతంగానూ అంగన్వాడీలు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారని, వారిపై రాజకీయ వేధింపులు పెరిగా యని చెప్పారు. వీటిపై ప్రభుత్వం స్పందించే వరకూ పోరాటాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు.

ప్రజాశక్తి-ఈపూరు :
స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద సమ్మె శిబిరాన్ని టిడిపి నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆ పార్టీ నాయకులు ఆర్‌.జగ్గారావు మాట్లాడుతూ అంగన్వాడిలను ప్రభుత్వం వేధించడం దుర్మార్గపు చర్యన్నారు. టిడిపి అధికారం చేపట్టాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతురెడ్డి, టిడిపి నాయకులు జి.శ్రీనివాసరావు, కె.కోటేశ్వరరావు, మోషే, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – అచ్చంపేట :
మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగుడ సాధించలేదని అంగన్వాడీలతో పెట్టుకున్న వైసిపి ప్రభుత్వానికీ అదేగతి పడుతుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎఐటియుసి నాయకులు బి.శ్రీనివాసరావు, అంగన్వాడీ నాయకులు రేవతి, శ్యామల, ఇందిరా, రమాదేవి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల :
పట్టణంలో ప్రధాన రహదారిపై అంగన్వాడీలు భిక్షాటన చేశారు. సమ్మె శిబిరం వద్ద వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు. సమ్మె శిబిరాన్ని ఎస్‌టియు నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. సీనియర్‌ నాయకులు కె.కిషోర్‌ మాట్లాడుతూ కూలీలు పొలం పనులకు వెళ్తూ తమ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాల్లో ధైర్యంగా వదిలి వెళ్తుంటారని, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీల డిమాండ్లు చాలా న్యాయమైనవని, కేంద్రాల తాళాలు పగలగొట్టించే హేయమైన చర్యలను ప్రభుత్వం కట్టిపెట్టాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఇందిరా, కె.పద్మావతి, కోటేశ్వరి, సుందరలీల, రుక్మిణి, మహలక్ష్మీ, శివపార్వతీ, జిజి భారు, రహేనా, చంద్రకళ, లీలావతి, వెంకటరమణ, నాగలక్ష్మీ, రాధ, హైమవతి, ఎస్‌టియు నాయకులు డేవిడ్‌ విల్సన్‌, గంగాధర్‌బాబు, జె.బాలునాయక్‌, టి.రాజశేఖర్‌, రత్యానాయక్‌, కృష్ణానాయక్‌, భీమా గోవిందరావు, బి.అమర్‌నాథ్‌, ఆంజినాయక్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి-నాదెండ్ల :
అంగన్వాడీలు ప్రదర్శనగా బయలుదేరి భిక్షాటన చేపట్టారు. అనంతరం గణపవరంలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఎస్‌ఐ లేరనే కారణంతో పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. అంగన్వాడీలకు మద్దతుగా కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడారు. యూనియన్‌ నాయకులు సావిత్రి, రమాదేవి, రాజ్యలక్ష్మి, సుబ్బమ్మ, శ్రీలక్ష్మి, రాధా, భవాని, జ్యోతి, రాజేశ్వరి, సామ్రాజ్యం, శిరీష, రాధా రాణి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – అమరావతి :
స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుండి గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు భిక్షాటన చేశారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడారు.

➡️