టిడిపిపై బురదజల్లడానికి సిగ్గుండాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ఆపి వైసిపి నాయకులు టిడిపిఐ బురదజల్లడానికి సిగ్గుం డాలని టిడిపి రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ద్వారకా నగర్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా పింఛన్ల పంపిణీ ప్రారంభించింది టిడిపినే అని గుర్తు చేశారు. రూ.3వేలు ఇస్తామన్న జగన్‌ హామీ నిలబెట్టుకున్నారా, 5 ఏళ్లకు రూ.1000 పెంచి, విద్యుత్‌ వినియోగంపై తిరిగి ఇచ్చింది రాబట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. వైసిపి ఎమ్మెల్యేల జీతాలకు కొదవలేదని, పెన్షన్లు ఇచ్చేందుకు ఆటంకం ఏమిటని ప్రశ్నించారు. పెన్షన్లపై వైసిపి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే నిలిచిన పెన్షన్‌ డబ్బులతో కలిపి నాలుగు వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. కడప అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మాధవి మాట్లాడుతూ వైసిపి అనేక అపోహలు సష్టిస్తుందని, కాంట్రాక్టర్లకు ఖజానా దోచిపెట్టి అవ్వ, తాతలకు అన్యాయం చేస్తారా అని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాలంటరీలు, సచివాలయ సిబ్బంది, ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసినా పాల్గొన్నారని విమర్శించారు. డిప్యూటీ సిఎం పింఛన్ల నిలుపుదల విషయంలో టిడిపిపై విష ప్రచారం సోషల్‌ మీడియాలో నమ్మించేలా డ్రామాలాడుతున్నారని వాపోయారు. సైన్‌ బోర్డులకు అనుమతులు తీసుకునే ప్రకటనలు ఏర్పాటు చేస్తే వాటిని చింపే పనిలో ఉన్నారని విమర్శించారు. సిసి ఫుటేజీలో నిజాలు బయటికి తీసి, వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ అవ్వ, తాతలకు రూ.3000 పెన్షన్‌ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి జగన్‌, అధికారంలోకి రాగానే దశలవారీగా పెంచి ఇచ్చారని, టిడిపి అధికారంలోకి రాగానే నేరుగా ఇండ్ల వద్దనే అవ్వ ,తాతలకు పెన్షన్‌ పంపిణీ చేస్తామన్నారు. దివాలా తీసిన వైసిపి ప్రభుత్వం ఎన్నికల్లో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. సమావేశంలో నగర అధ్యక్షులు శివకొండారెడ్డి, జయ శేఖర్‌ పాల్గొన్నారు.

➡️