ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీని జయప్రదం చేయండి

Jan 23,2024 21:05

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : ఈనెల 26న సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రైతు సంఘం, కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ట్రాక్టర్‌ బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని ఎస్‌కెఎం జిల్లా కన్వీనర్‌ బంటు దాసు పిలుపునిచ్చారు. మంగళ వారం స్థానిక బైపాస్‌ రోడ్డు కాలనీలో ఉన్న రైతు కూలీ సంఘం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బంటు దాసు మాట్లాడుతూ ఆలిండియా ఎస్‌కెఎం పిలుపు మేరకు ఈనెల 26న వివిధ రైతు, కార్మిక సంఘాలు కలిసి స్థానిక ఎఎంసి నుండి సుందరయ్య భవనం వరకు ట్రాక్టర్లు, బైకులు, ఆటోలతో ర్యాలీ నిర్వహించి మన రైతు, కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లను పెట్టరాదని, తక్షణం అమలులోకి వచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని, ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉపాధి హామీ బడ్జెట్‌ను రూ.రెండు లక్షలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల ఢిల్లీలో రైతు ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఈ సమస్యలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించేలా ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు కార్మిక, కర్షక ఐక్య పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 26న ఉదయం 11 గంటలకు మార్కెట్‌ యార్డుకు చేరుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అప్పలనాయుడు, టి.జీవ, సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ, గిరిజన సంఘం సహాయ కార్యదర్శి కె.రామస్వామి, ఎపి రైతు కూలీ సంఘం సహాయ కార్యదర్శి ఎం.భాస్కరరావు, ఎస్‌.విశ్వేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఇవి నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు గరుగుబిల్లి సూరయ్య, జనసేన నాయకులు బోను చంటి తదితరులు పాల్గొన్నారు.

➡️