ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడు దుర్మరణం

Dec 29,2023 21:15

ప్రజాశక్తి – బలిజిపేట :  పంతులను అడిగి మంచి ముహూర్తం కనుక్కొని శనివారం కాబోయే భార్యను చూడ్డానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యువకుడు శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌ బోల్తా పడి మృతి చెందడంతో మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జెసిబి ఓనర్‌గా అందరి మన్ననలు పొందాడు ఆ యువకుడు. పోలీసులు ఇచ్చిన వివరాలు ప్రకారం సింగిపురపు శ్రీరాములు (30) తన సొంత ఇటుక బట్టీ నుంచి మట్టిని చదును చేస్తుండగా చుట్టూ ఉన్న గోడ ట్రాక్టర్‌కు తగలడంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి అతనిపై బోల్తా పడడంతో మట్టిలోకి కూరుకుపోయి గుండెకు బలమైన గాయాలు తగలడంతో హాస్పటిల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం పార్వతీపురం జిల్లా హాస్పిటల్‌కు మృతి దేహాన్ని పంపించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. అల్లారు ముద్దుగా చూసుకుని ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలుగా మారడంతో స్థానికుల్లో కూడా విషాదఛాయలు అలముకున్నాయి.

➡️