డంపింగ్‌యార్డు ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్తులు

Mar 5,2024 21:36

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్‌ యార్డును మండలం సుంకి రెవెన్యూ పరిధిలోని తోటపల్లి ప్రాజెక్టు సమీపాన పాత కాలువ గట్టుపై ఏర్పాటు చేయడానికి అధికారులు పనులు ప్రారంభించడం పట్ల సిపిఎం తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తూ మంగళ వారం పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ, సుంకి సర్పంచ్‌ కరణం రవీంద్ర మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఒక పక్క చెబుతూనే, మరోవైపు మున్సిపాలిటీ చెత్తను ఇక్కడకు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మెయిన్‌ రోడ్డుకు ఆనుకొని విలువైన వ్యవసాయ భూములు ఉన్నచోట డంపింగ్‌ యార్డ్‌ ఎలా పెడతారని ప్రశ్నించారు. సుంకి, సంతోషపురం, మరుపెంట, నాగూరు, చిలకాం, శివ్వాం తదితర గ్రామ పంచాయతీల ప్రజలు వ్యవసాయ, వ్యవసాయేతర అవసరాలకు ఈ నాగావళి నది నీటిపై ఆధారపడుతున్నారని, ఈ డంపింగ్‌ యార్డ్‌ వల్ల నీరు కలుషితమై ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు వాల్టా చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు తమ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని,. ప్రారంభించిన పనులను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ అధికారులు చేస్తున్న ఈ చర్యల పట్ల కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పందించాలని, కురుపాం నియోజకవర్గ ప్రజలకు నష్టం చేకూర్చే చర్యలను నిలుపుదల చేయించాలని, లేకుంటే ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆందోళనలో సుంకి, సంతోషపురం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

➡️