డయేరియా లక్షణాలతో మహిళ మృతి

Feb 24,2024 00:17

స్థానికులతో మాట్లాడుతున్న ఎంహెచ్‌వో డాక్టర్‌ కె.హెచ్‌ నిర్మల
ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో డయేరియా లక్షణాలతో మహిళ మృతి చెందారు. స్థానిక గురవయ్య కాలనీకి చెందిన బండి లక్ష్మి(60) వాంతులు, విరోచనాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకుని ఆ ప్రాంతంలో పర్యటించిన జనసేన పిఏసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. రూ.100 కోట్లతో ఏర్పాటు చేసిన రక్షితనీటి పథకం నిర్వహణాలోపం కారణంగా నీరు కలుషితమై డయేరియా సోకిందని, మహిళ చనిపోవటమే కాకుండా మరి కొంతమంది అదేలక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి, ఇంటింటి సర్వే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అయితే రెండు రోజుల క్రితం తెనాలికి రక్షితనీటిని తరలించే మెయిన్‌ పైప్‌లైన్‌ పగిలిపోవటం, దాదాపు 20 రోజుల క్రితం ఐతానగర్‌లో జెసిబి సాయంతో తవ్వి పైప్‌లైన్‌ మర్మతులు చేయటం, ఆ సందర్భంగా ఓ ప్రైవేటు కార్మికుడు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి కలుషితం విషయంలో వాస్తవాలు లేకపోలేదన్న వాదనలు కూడా ప్రజల నుంచి వినవస్తున్నాయి.
స్పందించిన కమిషనర్‌, ఎంహెచ్‌వో
ఘటనపై మున్సిపల్‌ కమిషనర్‌ బి.శేషన్న, మున్సిపల్‌ ఆరోగ్యాధికారిణి డాక్టర్‌ కె.హెలెన్‌ నిర్మల స్పందించారు. హుటాహుటిన ఎంహెచ్‌ఓ ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయేరియా సోకిందనటంలో వాస్తవం లేదన్నారు. ఎనిమిది మంది ఉన్న కుటుంబంలో ముగ్గురికి వాంతులు, విరోచనాలయ్యాయని, వారు మంగళవారం తెనాలి జిజిహెచ్‌లో చేరి చికిత్స పొందారని, గురువారం వారిని గుంటూరు జిజిహెచ్‌కు తరలించారన్నారు. వారిలో ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, వృద్ధురాలు మాత్రం చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారు తీసుకున్న ఆహారం కలుషితం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్టు చెప్పారు. వారు ఇంట్లో ఉపయోగించేది కూడా మున్సిపల్‌ వాటర్‌ కాదని, మినరల్‌ వాటర్‌ అని చెప్పారు. మృతి చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులను కూడా కలిసి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

➡️