డిఆర్‌ఎంను కలిసిన అఖిలపక్షం, బాధితులు

Feb 7,2024 00:07

డిఆర్‌ఎంకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి-తాడేపల్లి :
తాడేపల్లిలో రైల్వే స్థలాల్లో ఉంటున్న పేదల ఇళ్లను తొలగించొద్దని అఖిలపక్ష పార్టీల నేతృత్వంలో పేదలు మంగళవారం విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రత్యామ్నాయం స్థలాలు చూపించి ఇళ్లు నిర్మించే వరకు తమ ఇళ్ల తొలగింపు నిలిపేయాలని, ఈ మేకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. పట్టణంలోని సలాం సెంటర్‌, రన్నింగ్‌ రూమ్‌ సెంటర్‌, పోతురాజుస్వామి గుడి, ముగ్గురోడ్డు, లంబాడీపేట, సీతానగరం తదితర ప్రాంతాల్లో సుమారు 900 మంది పేదలు రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. గతంలో పంచాయతీ, మున్సిపల్‌ పాలకవర్గం తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించిందని వివరించారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారని డిఆర్‌ఎంకు తెలిపారు. డిఆర్‌ఎం స్పందిస్తూ జిల్లా కలెక్టర్‌ను కూడా అఖిలపక్ష నాయకులు కలిసి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని వివరించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరావు, రూరల్‌, పట్టణ కార్యదర్శులు డి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.బాబూరావు, ఎస్‌కె సుబాని, సిపిఐ నాయకులు టి.వెంకటయ్య, వైసిపి జిల్లా కార్యదర్శి ఇ.డేవిడ్‌రాజు, సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఎం.వెంకటరామిరెడ్డి, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎం.ప్రకాష్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు సామ్యేలు, టిడిపి నాయకులు కె.మల్లేశ్వరరావు, టి.దుర్గారావు, మరియన్న, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️