డిఎఫ్‌ఎం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

డిఎఫ్‌ఎం నిర్మాణ పనులు

ప్రజాశక్తి-కాకినాడజిల్లా మినరల్‌ ఫండ్‌ (డిఎఫ్‌ఎం)తో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో డిఎఫ్‌ఎం నిధులతో కాకినాడ జిల్లాలో చేపట్టిన పనుల ప్రగతిపై ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌, మైన్స్‌, ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్‌, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో డిఎఫ్‌ఎం నిధులతో 281 పనులను రూ.43.955 కోట్లతో మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిలో రూ.16.175 కోట్ల ఖర్చుతో 51 పనులు ఇప్పటివరకు పూర్తి చేసినట్టు చెప్పారు. 103 పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆమె తెలిపారు. అంతర్గత రహదారులు, పశువుల ఆసుపత్రి, మంచి నీటి ట్యాంకులు, పాఠశాలలకు అదనపు తరగతులు, రోడ్లు, కల్వర్టులు, అంగన్‌వాడీ భవనాలు తదితర నిర్మాణాలు చేపట్టినట్టు చెప్పారు. ఈ పనులన్నీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వినియోగంలోనికి తీసుకురావాలని కలెక్టర్‌ అధికారులకు స్పష్టం చేశారు. పనులు పూర్తయిన మేరకు బిల్లులు సమర్పించాలన్నారు. పంపా రిజర్వాయర్‌ గేట్లు మరమ్మతులకు రూ.4.45 లక్షలు, ప్రతిపాడు మండలంలోని శంఖవరం, వేళింగి గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులు మొత్తం రూ.100 లక్షలు, ఉత్తరకంచి-పెద్దిపాలెం గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులకు రూ.20 లక్షలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల నిమిత్తం రూ.4.99 లక్షలు, కరప మండలంలోని ఎండమూరు, సంపర, కురాడ గ్రామాల పరిధిలోని బోడి కాలువ డీసిల్టేషన్‌ పనులు నిమిత్తం రూ.27.81 లక్షలు కొత్తగా మంజూరు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, వ్యవసాయ శాఖ జెడి ఎన్‌.విజరు కుమార్‌, పశుసంవర్థక శాఖ జెడి ఎస్‌.సూర్యప్రకాశరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిఒలు ఇట్ల కిషోర్‌, జె.సీతారామరావు, మైన్స్‌ డిడి ఇ.నరసింహారెడ్డి, ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ హరిప్రసాద్‌ బాబు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ బి.సత్యనారాయణ మూర్తి, పెద్దాపురం ఇరిగేషన్‌ డిఇ రామ్‌గోపాల్‌, జెడ్‌పి ఎఒ ఎం.బుజ్జిబాబు పాల్గొన్నారు.

➡️