డిఎస్‌సి ఉన్నట్టా..లేనట్టా!

Jan 30,2024 20:29

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. ఇదిగో అదిగో అంటూ గత కొద్దినెలలుగా ప్రభుత్వం నిరుద్యోగులను ఊరిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏటా డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామంటూ ఇచ్చిన మాటనూ ప్రభుత్వం తప్పింది. ఎన్నికల నేపథ్యంలో చివరి సంవత్సరంలోనైనా నోటిఫికేషన్‌ వస్తుందని ఆశించిన అభ్యర్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం నోటిఫికేషన్‌ ఇస్తున్నామంటూ ప్రకటించడ ంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నోటిఫికేషన్‌ వస్తుందా? లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉమ్మడి జిల్లాలో 18 వరకు బిఇడి కళాశాలలు ఉన్నాయి. కోర్సు రెండేళ్ల కాలపరిమితి కావడంతో ప్రతి రెండేళ్లకు సుమారు 900 మంది రిలీవ్‌ అవుతున్నారు. మరో వైపు డైట్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కాలేజ్‌,ప్రైవేటు కాలేజీలు 8వరకు ఉన్నాయి. ఈ కాలేజీ ల నుంచి 800మంది వరకు రిలీవ్‌ అవుతున్నారు. వీరు కాకుండా ఇప్పటికే బిఇడి, డిఇడి కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు రానివారు వేలాది మంది ఉన్నారు. టిడిపి హయాంలో 2018 అక్టోబరు 25న చివరి సారిగా నోటిఫికేషన్‌ వెలువడింది. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో వేలాది మంది నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఆ వైపుగా అడుగులు మాత్రం పడటం లేదు. నోటిఫికేషన్‌ కోసం జిల్లాల నుంచి వివరాలు సైతం తీసుకోలేదని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట అధికారులు పంపిన వివరాలు మినహా కొత్తగా ఏమీ పంపలేదని తెలుస్తోంది. దీంతో డిఎస్‌సి నోటిఫికేషన్‌ మాట ఉత్తదే అనే చర్చ జరుగుతోంది.కొత్త ఉద్యోగాల భర్తీ వద్దంటూ ప్రత్యేక ఆదేశాలుఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఏ ప్రభుత్వ శాఖలోనూ ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపొద్దని సూచించినట్లు తెలిసింది. పోస్టుల అప్‌ గ్రేడేషన్‌, కొత్త పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. చివరకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సైతం నియమించొద్దంటూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం లేదని విద్యాశాఖకు చెందిన అధికారులు అభిప్రాయపదుతున్నారు. నోటిఫికేషన్‌ ఇస్తామని ఊరించి ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ పలువురు నిరుద్యోగ అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలు వస్తుండటంతో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చడానికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్‌ ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ డిఎస్‌సి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్రనిరాశ, నిస్పహలు నెలకొన్నాయి. సుమారు ఆరేళ్లగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ లేకపోవడంతో బిఇడి, డిఇడి కోర్సులు చేసిన వారు ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరిపోయారు.కొంతమంది ప్రయివేట్‌ ఉద్యోగాల్లో కుదురుకున్నారు. మరికొంతమంది వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గత కొద్ది నెలలుగా డిఎస్‌సికి సంబంధించి ప్రకటనలు చేయడంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల అంతా ప్రిపరేషన్‌ మొదలు పెట్టేశారు. తాజాగా టెట్‌ నోటిఫికేషన్‌ రావడంతో ఆశలు చిగురించాయి. అయినా ఎన్నికల నోటిఫికేషన్‌ మరి కొద్ది రోజుల్లో రానుండడంతో డిఎస్‌సి నోటిఫికేషన్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయినా నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేస్తారనే నమ్మకంతో వేలాదిమంది విజయనగరం జిల్లా కేంద్రంలో అద్దె రూములో,కోచింగ్‌ సెంటర్లో చేరి చదువుతున్నారు.లక్షలు రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూసి ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల క్రితం డిఎస్‌సి నోటిఫికేషన్‌ కోసం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలో ఖాళీలు లేవు ఉమ్మడి జిల్లాలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీల లేవు. గత సారి జరిగిన బదిలీలు తర్వాత జిల్లా విద్యా శాఖ అధికారులు జిల్లాలో ఎటువంటి ఖాళీలు లేవని అదనపు టీచర్లను చూపించారు. కొత్త డిఎస్‌సి నోటిఫికేషన్‌ వచ్చినా ఉపాధ్యాయ ఖాళీలు లేకపోవడంతో కొత్త పోస్టులు సృష్టించి ఇవ్వాలి తప్ప ఖాళీలు లేవని విద్యా శాఖ అధికారులను చెబుతున్నారు. ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసం డిఎస్‌సి నోటిఫికేషన్‌ అంటూ డ్రామాలు ఆడుతున్నారని డిఎస్‌సి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️