డ్రైవర్లకు అందని జీతాలు

Feb 25,2024 21:28

ప్రజాశక్తి – సాలూరు: అసలే అరకొర జీతం, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, బస్సు ఎక్కితే దిగే వరకూ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. రోజుకు వెయ్యి చొప్పున నెలకు రూ.15వేలు జీతం. 15రోజులే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు నాలుగు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో వారు గత ఐదురోజులుగా అద్దె బస్సులను నడపకుండా వదిలేశారు. ఫలితంగా స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. డిపో పరిధిలో సుమారు 13 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ఇవన్నీ పల్లె వెలుగు బస్సులే. మారుమూల గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె బస్సుల్లో డ్రైవర్లకు ప్రయివేటు యజమాని జీతాలు చెల్లిస్తారు. కండక్టర్‌ మాత్రమే ఆర్టీసీ సంస్థకు చెందిన ఉద్యోగి. డిపో పరిధిలో ఉన్న మొత్తం బస్సు సర్వీసుల్లో ఎక్కువ అద్దె బస్సు సర్వీసులే వున్నాయని తెలుస్తోంది. విజయనగరానికి చెందిన ఓ కాంట్రాక్టరుకు చెందిన అద్దె బస్సులు డిపోలో ఎక్కువగా వున్నాయి. ఈ బస్సు డ్రైవర్లకు నాలుగు నెలలుగా జీతాలందకపోవడంతో విధులు నిర్వహించలేమని వారు డిపో యాజమాన్యానికి తెగేసి చెప్పారు. దీంతో డిపో మేనేజర్‌ కాంట్రాక్టరును రప్పించి డ్రైవర్ల జీతాల సమస్య పరిష్కరించాలని ఒత్తిడి పెంచారు. కాంట్రాక్టరు జీతాలపై డ్రైవర్లకు హామీ ఇచ్చారు. అయితే కాంట్రాక్టరు చెప్పిన గడువులోగా జీతాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు విధులు బహిష్కరించారు. ఫలితంగా డిపో పరిధిలో ఉన్న 13 అద్దె బస్సులు నిలిచిపోయాయి. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నిలిచిన సర్వీసులన్నీ గ్రామీణ ప్రాంత సర్వీసులు కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు అధిక అధిక మొత్తంలో ఛార్జీలు వెచ్చించి ప్రయివేటు వాహనాలపై ప్రయాణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.ప్రత్యామ్నాయ చర్యలేవీ?నాలుగు రోజులుగా అద్దె బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిపో మేనేజర్‌ కాంట్రాక్టరును రప్పించి డ్రైవర్లతో చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. డిపో పరిధిలో 76 బస్సు సర్వీసులు వున్నాయి. వీటిలో సుమారు 31 అద్దె బస్సు లేనని తెలుస్తోంది. డిపో పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు తరలిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో డిపోను అద్దె బస్సులతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపి మొత్తం బస్సు సర్వీసులు తిరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.సమస్య పరిష్కారానికి కృషి : భాస్కరరెడ్డి, డిపో మేనేజర్‌అద్దె బస్సు డ్రైవర్లు, కాంట్రాక్టరు మధ్య జీతాల సమస్య కారణంగా 13 బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కావొచ్చు. కాంట్రాక్టరు, డ్రైవర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

➡️