తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనాలి : సిపిఎం

ప్రజాశక్తి – దెందులూరు

మిచౌంగ్‌ తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని కొవ్వలి, దోసపాడు గ్రామాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిపిఎం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంగళవారం పర్యటించారు. కల్లాల్లో బరకాలు కప్పిన ధాన్యాన్ని, నేల వాలిన వరి పంటను పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రైతులు ఆందోళనకు స్పందించిన మండల అధికారులు ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.కిషోర్‌, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకష్ణ మాట్లాడారు. తుపాను వల్ల తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం తడిసిపోకుండా పంటను రక్షించుకునేందుకు తగిన టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేయలేదని చెప్పారు. వాహనాలు తగినంతగా ఏర్పాటు చేయకపోవడం వల్ల కల్లాల్లోనే ఉండిపోయిందన్నారు. కొనుగోలు నిబంధనలు సవరించి తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. పంటల బీమా వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంతగాని అనందరావు, చౌలముడి ఏసుభక్తి, డి.రామకృష్ణ, మోజేస్‌, రాజు, కడిమే కిరణ్‌, రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.

➡️