తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం

Mar 27,2024 21:17

ప్రజాశక్తి – లక్కవరపుకోట : స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం సర్వసభ సమావేశం తూతూ మంత్రంగా జరిగింది. సుమారు ఐదుశాఖల అధికారులతో పాటు కొద్దిపాటి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అర్థగంట వ్యవధిలో ముగిసిన ఈ సమావేశానికి స్థానిక ఎంపిపి గేదెల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున సమావేశంలో తగు జాగ్రత్తలు పాటించాలని సభ్యులకు ఎంపిడిఒ కె.రూపేష్‌ సూచించారు. పంచాయతీ అనుమతులు లేకుండా రేగ రెవెన్యూ పరిధిలో పన్నులు కట్టని మద్యం దుకాణం, దాబాహోటల్‌, కోళ్లఫారం, మరో నివాస గృహంతో పాటు కల్లేపల్లి వరకు రోడ్డు పక్కల ఉన్న సుమారు 20 దుకాణాలకు విద్యుత్‌ సరఫరా ఎలా ఇచ్చారని విద్యుత్‌ శాఖ ఎఇ ఐ. కృష్ణను రేగ ఎంపిటిసి బొడ్డు గణపతి ప్రశ్నించారు. గంగుపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు లోవోల్టేజ్‌ సమస్య తీవ్రంగా ఉందని తక్షణమే పరిష్కరించాలని గంగుపూడి సర్పంచ్‌ గొలగాని హరిప్రసాద్‌ కోరారు. అనంతరం ఎపిఒ ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ వేసవికాలం ఎండలు దృష్ట్యా ఉపాధి పని వేళలు ఉదయం 5.30 గంటల నుండి 10.30 గంటల వరకు మార్చామన్నారు. పని ప్రాంతాలలో ఉపాధి కూలీలకు ఎండ తగలకుండా ఉండేందుకు 2018లో ఇచ్చిన టెంట్లుతో పాటు తాటాకులు, కొబ్బరి కొమ్ములతో చలవ పందెరులను వేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపిపి ఆవాల శ్యామల, చందులూరు, లచ్చింపేట ఎంపిటిసిలు యడ్ల కిషోర్‌ కుమార్‌, భూమిరెడ్డి స్వామినాయుడు, కె జగ్గన్నదొర, కో ఆప్షన్‌ నెంబర్‌ షేక్‌ ఖాసిం, సర్పంచులు ముత్యం భాస్కరరావు, కొయ్యన కృష్ణ, కొన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.శృంగవరపుకోట: ఎస్‌కోట మేజర్‌ పంచాయతీ జనరల్‌ బాడీ సమావేశం బుధవారం నామ మాత్రంగా నిర్వహించామని పంచాయతీ ఇంచార్జ్‌ ఇఒ సిహెచ్‌ కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలలో ఉన్నందున పంచాయతీ పాలన వ్యవహారాల గూర్చి చర్చించకూడదని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీకి వచ్చిన ఆదాయం, జనన మరణాల గూర్చి తెలియపరచి సమావేశాన్ని ముగించామన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ సంతోష్‌ కుమారి, ఐదుగురు వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️