తేలుతున్న పంట నష్టం

Dec 13,2023 22:44
క్షేత్ర స్థాయిలో

ప్రజాశక్తి – యంత్రాంగం

తుపాన్‌ ప్రభావం మిగిల్చిన పంట నష్టం లెక్కలు తేలుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలోని వివిధ మండలాల్లో అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరీశీలిస్తున్నారు. రైతులు, అధికారులు బృందంగా ఏర్పడి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి పంట నష్టంను లెక్కిస్తున్నారు. సామర్లకోట రూరల్‌ మండల పరిధిలో తుపాన్‌ ప్రభావంతో సుమారు 835 హెక్టార్ల పరిధిలో వరి పంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారి ఇమ్మిడిశెట్టి సత్య తెలపారు. క్షేత్ర స్థాయిలో నష్టం లెక్కింపు బృందాలు సర్వే చేస్తున్నాయని తెలిపారు. మండలంలోని ఉండూరులో నిర్వహించిన సర్వేలో 120 ఎకరాల్లో పంట నష్టంను జరిగినట్లు బృందం గుర్తించింది. రైతులకు పూర్తి స్దాయిలో న్యాయం జరిగేలా పంట నష్టం సర్వే నిర్వహిస్తున్నట్లు ఎఒ సత్య వివరించారు. ఏలేశ్వరంపూర్తి పారదర్శకతతో రైతన్నలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా అంచనాలు రూపొందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి తెలిపారు. మండలంలోని జె.అన్నవరం, మర్రివీడు గ్రామాల్లో బుధవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీలోగా పంట నష్టం రూపొందించి నష్టపోయిన రైతులు జాబితాను ఆయా ఆర్‌బికె కేంద్రాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. 18 నుంచి 22లోగా ఆ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలన్నారు. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.17 వేలు, అరటి పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేలు ప్రభుత్వం అందించనున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో వ్యవసాయ, రెవెనూ శాఖల అధికారులతోపాటు, ఆర్‌బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రౌతులపూడిఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ ప్రాంతాల్లో 510 హెక్లార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారి ఈశ్వరరావు బుధవారం తెలిపారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం గుర్తించడం జరుగుతుందని, నష్టపోయిన రైతులు ఆయా గ్రామ సచివాలయాలకు భూముల సంబంధించిన రికార్డులను అందజేయాలని ఆయన తెలిపారు. జగ్గంపేట రూరల్‌ ఇటీవల సంభవించిన తుపాన్‌ ప్రభావంతో మండలంలో 18 గ్రామాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. జగ్గంపేట మండల వ్యవసాయాధికారి శ్రీరామ్‌ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 2 వేల హెక్టర్లలో పంట నష్టం సంభవించిందన్నారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 18లోగా పంట నష్టంపై సర్వే పూర్తికానుందని, గ్రామ స్థాయిలో సర్పంచ్‌, కార్యదర్శి, విఎఎ, విఆర్‌ఒలతో పంట నష్టం పరిశీలించేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు.

➡️