త్రిపురాంతకం వైసిపిలో బయటపడ్డ లుకలుకలు

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకంలో బుధవారం వైసీపీ నూతన సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. నూతన ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ అందరినీ కలుపుకొని పోవడంలేదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ముందుగా త్రిపురాంతకంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీ సమయంలో తన భర్తను పట్టించుకోవడం లేదని రాజుపాలెం ఎంపిటిసి చల్లా జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా జ్యోతి భర్త చల్లా యల్లారెడ్డి వైసీపీ మండల ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయితే తనను కలుపుకొని పోలేదన్న ఆగ్రహంతో ర్యాలీగా వెళ్తున్న చంద్రశేఖర్‌ వాహనాన్ని అడ్డంగా నిలబడి నిలిపివేసింది. తన భర్తను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రశేఖర్‌ తన కారులో యల్లారెడ్డిని ఎక్కించుకున్న తర్వాత ఆమె అడ్డు తొలిగింది. ఆ తర్వాత అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు రావడం సహజమేనన్నారు. అందరినీ కలుపుకొని పోతానని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి దానిని పూర్తి చేశారని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెప్పారు. యర్రగొండపాలెంలో వైసీపీ జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కోట్ల సుబ్డారెడ్డి, మండల కన్వీనర్‌ సింగారెడ్డి పోలిరెడ్డి, మాజీ ఎంపిపి ఇళ్ల ఆంజనేయరెడ్డి, జడ్పిటిసి మాకం జాన్‌పాల్‌, సర్పంచ్‌ పొన్నా వెంకటలక్ష్మి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రంగబాబు, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు చల్లా యల్లారెడ్డి, వైసీపీ నాయకులు మల్లికార్జునతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️