ధాన్యం దోపిడీపై విచారణ

Jan 11,2024 21:15

 ప్రజాశక్తి – జామి  :  ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఈ మేరకు జామి, గంట్యాడ మండలాల్లో బాధిత రైతులను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుమబాల విచారించారు. జామి మండలంలోని జామి, తానవరం, తెలగాపాలెం రైతులను వ్యవసాయ శాఖ కార్యాలయానికి పిలిచి విచారించారు. తమ నుంచి అదనపు ధాన్యంతో పాటు అక్రమ వసూలు కు పాల్పడినట్లు రైతులు విచారణ అధికారి ఎదుట గోడు వినిపించారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి రైతులు విచారణకు హాజరై, మిల్లర్లు దోపిడీని వివరించారు. విచారణలో బాధితులు సమర్పించిన ఆధారాలను, మిల్లులకు చెల్లించిన అదనపు ధాన్యం, అక్రమ వసూలు తీరును అధికారులకు వివరించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.అక్రమాలపై కంటి తుడుపు చర్యలు గంట్యాడ మండలం రాయవలసలోని సూర్యరాజు మిల్లును బ్లాక్‌ లిస్టులో పెట్టిన విషయం తెలిసిందే. కానీ చర్యలు నామ మాత్రమే అని రైతు సంఘం నాయకులు బుద్దరాజు రాంబాబు అన్నారు. ‘ధాన్యం కొనుగోలులో బరితెగింపు’ అనే శీర్షిక తో ప్రజాశక్తి లో గత నెలలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జెసి మయూర అశోక్‌ స్పందించారు. ప్రధానంగా అదనపు ధాన్యం డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మిల్లులకు కీలక అదేశాలు జారీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం దించకోకుండా జాప్యం చేసే, మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పౌర సరఫరాల అధికారులు మిల్లులపై విచారణ జరిపారు. రైతుల నుంచి అదనపు ధాన్యం వసూలు కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఆ హెచ్చరికలు కంటితుడుపు చర్యగానే మారిందన్న ఆరోపణల వినిపిస్తున్నాయి. అన్ని మిల్లులో యదేచ్ఛగా దోపిడీ జరుగుతుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️