ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

Jan 17,2024 21:35

ప్రజాశక్తి-విజయనగరం :  ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు చేశామన్నారు. ఖరీఫ్‌ సీజనులో ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతున్న తీరుపై మంత్రి బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, పౌరసరఫరాల సంస్థ డిఎం మీనాకుమారి, డిఎస్‌ఒ మదుసూదన్‌, వ్యవసాయశాఖ జెడి విటి రామారావు, డిసిఒ రమేష్‌, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరును కలెక్టర్‌, జెసిలు మంత్రికి వివరించారు. రైస్‌ మిల్లర్లు తమ సమస్యలపై మంత్రికి వివరించగా ఆయా అంశాలపైన మంత్రి అధికారులతో సమీక్షించారు. ఏదైనా మండలం నుంచి వచ్చిన ధాన్యం అక్కడ మిల్లులకు కేటాయించగా మిగిలిన తర్వాతే ఇతర మండలాలకు తరలించాలని ఆదేశించారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో 3.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను ఇప్పటివరకు 2.67 లక్షల టన్నులు రైతుల నుంచి సేకరించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి గాను రూ.400 కోట్లు వారి ఖాతాల్లో జమచేశామన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ చేపట్టిన ఇ- క్రాప్‌ నమోదు ఆధారంగా వరి పంట దిగుబడిని అంచనా వేసి స్థానిక వినియోగానికి పోను 3.40 లక్షల టన్నులు మార్కెట్‌కు వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు లక్ష్యాన్ని నిర్ణయించుకొని ధాన్యం సేకరణ చేపట్టామన్నారు. జిల్లాలో నిర్ణయించిన లక్ష్యం మేరకు మరో 82 వేల టన్నులు సేకరణ చేయాల్సి వుందని, దీనిని కూడా త్వరగా చేపట్టేలా ఆదేశాలిచ్చామన్నారు. రాజాం, ఎస్‌.కోట నియోజక వర్గాల పరిధిలో పంట రాక ఆలస్యమైన కారణంగా ఆ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల టన్నులు రావలసి వుందని తెలిపారు. దీనికి అదనంగా ఈ ఏడాది నిర్వహించిన పంటకోత ప్రయోగాల ప్రకారం అదనపు దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసినందున అదనపు ధాన్యం సేకరణ అవసరమవుతుందని భావించి మరో 30 వేల టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు.అంబేద్కర్‌ స్మతివనం ప్రారంభానికి తరలి రావాలిరాష్ట్ర ప్రభుత్వం విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారతరత్న డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లాలోని బడుగు బలహీన వర్గాల ప్రజానీకం తరలిరావాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

➡️