నగరంలో కమిషనర్‌ పర్యటన

Feb 9,2024 19:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో వివిధ ప్రాంతాల్లో కమిషనర్‌ ఎం. మల్లయ్య నాయుడు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా ప్రాంతాలలో నెలకొన్న పారిశుధ్య పనితీరుపై నిశితంగా పరిశీలించారు. స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి పారిశుధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారా లేదా గమనించారు. అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాలు పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహించారని పారిశుధ్య కార్మికులకు ప్రశ్నించారు. గాంధీ పార్కు పరిసరాలను పరిశీలించారు. గాంధీ పార్కు అభివద్ధి చేసినట్లయితే ప్రజలు మరింతగా వినియోగించుకుంటారని ఇంజనీరింగ్‌ అధికారులతో చెప్పారు. అయ్యన్నపేట, బాలాజీ నగర్‌,ట్యాంక్‌ బండ్‌ రోడ్డు ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల వారి సమీక్షలలో తెలుసుకున్న అంశాలను పరిష్కరించే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా అవగాహన పెంచుకొని చెత్తాచెదారాలను కాలువలలో, ఆరుబయట ప్రాంతాలలో వేయకుండా చూడాలన్నారు. మరింత పారిశుధ్య మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలలో స్థానిక కార్పొరేటర్లు జివి రంగారావు, కడియాల రామకృష్ణ, వైసిపి నాయకులు శైలాడ సత్యనారాయణ, ఇన్చార్జి ఇఇ దక్షిణామూర్తి, డిఇలు, పారిశుధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట కుమ్మర వీధిలో ఉన్న స్వామి వివేకానంద పాఠశాలను ఆయన సందర్శించారు. .

➡️