నగర పంచాయతీలనియంత పాలన

Mar 8,2024 20:51

  ప్రజాశక్తి-నెల్లిమర్ల : నగర పంచాయతీలో నియంతపాలన కొనసాగుతోందని, దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతోందని పలువురు వైసిపి కౌన్సిలర్లు, నాయకులు తెలిపారు. స్థానిక మొయిద జంక్షన్‌ వైసిపి కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జానా ప్రసాద్‌, కౌన్సిలర్లు మైపాడ ప్రసాద్‌, మొయిద శ్రీనివాసరావు, 16వ వార్డు కన్వీనర్‌ పాండ్రంకి సత్యనారాయణ, నాయకులు నక్కాన వెంకటరావు మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా రామతీర్థం దర్శనార్థం పట్టణంలో కౌన్సిలర్లకు వంద పాసులు ఎమ్మెల్యే కేటాయించారని తెలిపారు. ఒక్కో కౌన్సిలర్‌కు కేవలం ఒక పాస్‌ మాత్రమే కమిషనర్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. మిగిలిన పాసులు ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల భర్తీ చేసిన వార్డు వాలంటీర్ల పోస్టుల విషయంలో పట్టణానికి చెందిన నాయకులు, అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక్కో వాలంటీర్‌ పోస్టును రూ.30 వేల చొప్పున ఏడు పోస్టులను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తమ వార్డుల్లో వాలంటీర్‌ పోస్టులను తమకు తెలియకుండా అమ్ముకోవడమే కాకుండా, సచివాలయ కన్వీనర్‌ పదవులను కూడా నచ్చిన వారికి కట్టబెట్టారన్నారు. పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గతంలో రామతీర్థం మార్గంలో చంపావతి నది ఒడ్డున స్వర్గధామానికి స్థల పరిశీలన చేసి కొబ్బరికాయ కొట్టి ప్రస్తుతం మరోచోట నిర్మించడంలో ఆంతర్యం ఏమిటని ధ్వజమెత్తారు. కష్టపడే కౌన్సిలర్లకు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా టిడిపి నాయకులతో కుమ్మక్కు అయ్యారన్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు పట్టించుకోకపోతే పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. సమావేశంలో రెండో వార్డు కన్వీనర్‌ పైల మురళి, కాళ్ళ మహేష్‌, పార్థసారథి, మన్మధ తదితరులు పాల్గొన్నారు.

➡️