నమ్మితేనే ఓటేయండి

Mar 19,2024 21:51

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి తదితర విషయాలపై తనను నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని వైసిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం రోటరీ క్లబ్‌, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నానని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తక్కువ కావడం వలన నీటి ఎద్దడి లేకుండా ముషిడిపల్లి, చంపావతి తాగునీటి పథకాలపై రివ్యూ చేసి, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆండ్ర ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తించి నీరు విడుదల చేయించడం జరిగిందనీ, నగరంలో ఐదేళ్లలో కార్పొరేషన్‌ స్థాయిలో సుందరీకరణ, అభివృద్ది పనులు జరిగాయని వివరించారు. అశోక్‌ గజపతిరాజు తాగునీటి కష్టాలు తొలగించే పని ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. తాను నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానని, నన్ను నమ్మితేనే ఓట్లు వేయాలని కోరారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో ఆయా క్లబ్‌ లు సభ్యులు,వ్యాపారులు పాల్గొన్నారు.

➡️