నలుగురికి విదేశీ విద్యాదీవెన మంజూరు

నలుగురికి విదేశీ విద్యాదీవెన మంజూరు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద నలుగురు విద్యార్థులకు రూ.39,33,582 ఆర్థిక సాయం మంజూరైనట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24కి ఒకరికి కొత్తగా మంజూరు కాగా, 2022-23లో ముగ్గురికి మంజూరు కాగా వారికి మొదటి, రెండవ విడత నిధులు మంజూరైనట్టు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహనరెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి జగనన్న విదేశీ విద్య కార్యక్రమంలో కలెక్టర్‌ మాధవీలత, జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, మున్సిపల్‌ కమీషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు విదేశీ విద్యా దీవెన కింద ప్రస్తుతం నలుగురితో కలిపి మొత్తం 16 మందికి సాయం అందిస్తోందన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కే కొద్ది నాలుగు వాయిదాల్లో ప్రభుత్వం స్కాలర్‌షిప్స్‌ మంజూరు చేస్తోందన్నారు. ఇమ్మిగ్రేషన్‌ కార్డు (ఐ-94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్‌ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్‌ ఫలితాల తర్వాత 3వ వాయిదా, విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన తరువాత 4వ సెమిస్టర్‌ పూర్తి చేసి మార్కుల ఆన్లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక చివరి వాయిదా చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలు అర్హులని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ.కోటి వరకూ ప్రభుత్వం విదేశీ విద్యకు అందిస్తున్నట్లు తెలిపారు. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకంగా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.లక్ష, మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకం ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌డబ్లుఒ ఎం.సందీప్‌, పిఎస్‌.రమేష్‌, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

➡️