నల్ల చట్టాల అమలుకు కేంద్రం కుట్ర

Feb 11,2024 00:36

మంగళగిరిలో సంతకాలు సేకరిస్తున్న ఎయిమ్స్‌ ఆటో యూనియన్‌
ప్రజాశక్తి – దుగ్గిరాల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నరేంద్ర మోడీని గద్దె దించాలని కోరుతూ ఈనెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బందును, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. శనివారం దుగ్గిరాలలోని పసుపు మర్చంట్‌ హాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి రైతుసంఘం మండల కార్యదర్శి వై.బ్రహ్మేశ్వరరావు అధ్యక్షత వహించగా అప్పారావు మాట్లాడుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా ఆందోళనలు చేపట్టినట్లు చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మోసగించిందని, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్తు, అటవీ సంపదలను, రవాణా, బ్యాంకులు, ఎల్‌ఐసి, రైల్వే, పోర్టులు తదితర సంస్థలన్నీ ఆదానీ అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు అప్పచెబుతున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ కంపెనీ లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందన్నారు. రైతు ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేసి మరొక రూపంలో వాటిని అమలు చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలిచ్చిన ప్రభుత్వం నిత్యావసర వస్తువులన్నిటి పైనా జిఎస్టి పేరుతో పన్నులు పెంచిందని ఆవేదన వ్యక్తంచేశారు. బిజెపి విధానాలతో రైలులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు లక్షన్నర మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. విభజన చట్టం హామీల అమలులో రాష్ట్రాన్నీ బిజెపి దారుణంగా మోసం చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, రాజ్యాంగా హక్కులను కాలరాస్తోందని, ఈ నేపథ్యంలో జరిగే ఆందోళనల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎఐటియుసి నాయకులు సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె.బాలరాజు, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగమల్లేశ్వరరావు, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కె.వెంకటేశ్వరరావు, కౌలురైతు సంఘం నాయకులు బి.అమ్మిరెడ్డి, పోతురాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : బంద్‌, సమ్మె జయప్రదం కోసం ఎయిమ్స్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. పట్నంలోని పలు ఆటో స్టాండ్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై పోరాడాలని నాయకులు ఉద్ఘాటించారు. ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎంవి సుబ్బారావు, షేక్‌ ఖాజా, ప్రకాష్‌, రఫీ, కోటేశ్వరరావు, రాము, శ్రీనివాస్‌, రవి, ధన, రషీద్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు తపట్టణంలోని వివిధ కంపెనీలకు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు నోటీసులు అందజేశారు. బిర్లా ఆదిత్య, మోర్‌ కంపెనీ, టిటి యార్డు ముఠా కాంట్రాక్టర్స్‌, ఇమ్మిస్‌, బయోమెట్రిక్‌, ఇంపాక్స్‌ మందుల తయారీ కంపెనీ, మహాలక్ష్మి లారీ ట్రాన్స్‌పోర్టు, సెంట్రల్‌ వేర్‌ హౌస్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, సర్వో ఆయిల్‌ కంపెనీ మేనేజర్లకు కరపత్రాలు, సమ్మె నోటీసులు అందజేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు, ఎఐటియుసి నాయకులు టి.వెంకటయ్య, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, ఎఐఎఫ్‌ టియు, ఆటో ఓనర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయ కులు శ్రీను, కె.ఆదినారాయణ, ఎం.చెన్నయ్య పాల్గొన్నారు.

➡️