నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-పుల్లంపేట మిచౌంగ్‌ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.50వేలు చెల్లించి వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసి రెడ్డిపేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని అనంతంపల్లి పంచాయతీలో మిచౌంగ్‌ తుపాన ప్రభావంతో దెబ్బతిన్న పంటలను నియోజకవర్గ ఇన్‌చార్జి గోసాల దేవితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి తుపాను కారణంగా పంటలన్నీ తుడిచిపెట్టుకుపోవడంతో అన్నదాత కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి కంటితుడుపు చర్యలు కాకుండా ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌సిసెల్‌ కన్వీనర్‌ శాంతయ్య, జిల్లా నాయకులు ప్రతాప్‌రెడ్డి, పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్‌, ఉపాధ్యక్షుడు గద్య సుధాకర్‌, ఓబులవారిపల్లి మండల అధ్యక్షుడు హరికష్ణ రెడ్డి, చిట్వేలి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, మండల నాయకులు ఉప్పటూరి బ్రహ్మయ్య, మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

➡️