నామినేషన్ల ఆఖరు వరకు ఓటరుగా నమోదు

Mar 13,2024 21:31

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల చివరి రోజు వరకు ఓటరుగా నమోదు కావడానికి ఫారం-6 సమర్పించవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ శోభిక తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఎన్నికల సంబంధిత అంశాల పట్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితా ప్రకటన అనంతరం అందిన ఫిర్యాదులు, మీడియా నివేదికల ఆధారంగా విచారణ జరిపి 1305 తొలగింపులు చేపట్టినట్టు తెలిపారు. వీటిలో పాలకొండ నియోజక వర్గంలో 914, కురుపాం నియోజక వర్గంలో 338, పార్వతీపురం నియోజక వర్గంలో 355, సాలూరు నియోజక వర్గంలో 88 ఉన్నాయని వివరించారు. జిల్లాలో 769 లొకేషన్లలో 1031 పోలింగు కేంద్రాలున్నాయని ఆమె చెప్పారు. 26 పోలింగు స్టేషన్ల లొకేషన్లు, 244 పోలింగు కేంద్రాల పేర్లు మార్పుకు ఎన్నికల కమిషనుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. సమావేశంలో ఇన్‌ ఛార్జ్‌ డిఆర్‌ఒ జి,కేశవ నాయుడు, పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎ.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి రాష్ట్రంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పక్కాగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు చేస్తున్న ముందస్తు ఏర్పాట్ల రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లాల పోలీస్‌ సూపరిం టెండెంట్లు, పోలీస్‌ కమిషనర్లలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పెండింగ్‌ ఫారాలు పరిష్కారం, ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి రానున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా అమలు పర్చేందుకు కావలసినం యంత్రాంగాన్ని జిల్లా ఎన్నికల అధికారులు మరియు జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్లు, పోలీస్‌ కమిషనర్లు సిద్దం చేసుకోవాలని తెలిపారు. శాంత్రిభద్రతలకు భంగం కలుగకుండా, రీ పోలింగుకు అవకాశం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రోజువారీ నివేదికలను నిర్ణీత ఫారాలలో తప్పనిసరిగా పంపించాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరు నిశాంత్‌కుమార్‌, జెసి ఎస్‌ ఎస్‌ శోబిక, ఐటిడిఎ పిఒలు కల్పనాకుమారి, సి. విష్ణుచరణ్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌ వి సూర్యనారాయణ, పార్వతీపురం, పాలకొండ ఆర్‌డిఒలు కె.హేమలత, వి.వి.రమణ పాల్గొన్నారు.

➡️