నియోజక వర్గ ప్రజలకు మంత్రి బొత్స ద్రోహం

Jan 27,2024 19:02

  ప్రజాశక్తి- చీపురుపల్లి  : ఆర్‌ఇసిఎస్‌ను బోర్డులో విలీనం చేసి చీపురుపల్లి ప్రజలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యన్నారాయణ ద్రోహ చేసారని విజయనగరం పార్లమెంట్‌ స్థానం టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. రెస్కో విలీనానికి వ్యతిరేకంగా శనివారం స్థానిక ఆర్‌ఇసియస్‌ కార్యాలయం వద్ద నాగార్జున ఆధ్వర్యంలో ప్లకార్డులతో టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. చేసారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 40 ఏళ్ల నుండి ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు విద్యుత్‌ సేవలందిస్తున్న ఆర్‌ఇసియస్‌ని ఎపిఇపిడిసియల్‌ సంస్థలో ఎవరి ప్రయోజనాలకోసం విలీనం చేస్తున్నారని ప్రశ్నించారు. రెస్కో విలీనం అవ్వలేదంటూనే ఎపిఇపిడిసియల్‌ పేరు మీద ప్రజలకు, రైతులకు బిల్లులు ఎలా వస్తున్నాయని నాగార్జున ప్రశ్నించారు. అంతే గాకుండా బోర్డు పేరుతో వస్తున్న బిల్లులు అధిక మొత్తంలో ప్రజలనుండి ఎందుకు వసూలు చేస్తున్నారని అన్నారు. మంత్రి తలచుకుంటే ఆర్‌ఇసియస్‌ సంస్థను బోర్డులో కలపకుండా చేయలేరా అని నాగార్జున ప్రశ్నించారు. హుటాహుటిన ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించి సర్వీసు రిజిస్టార్‌ను ఎందుకు ఓపెన్‌ చేసారో తెలపాలని ఆయన కోరారు. ఆర్‌ఇసియస్‌లో దొంగ సర్టిఫికేట్లతో 59 మందిని ఎనర్జీ అసిస్టెంట్‌లుగా నియమించడంలో భారీగా అవినీతి జరిగిందని మీ పార్టీ ఎంపి బెల్లాన చంద్రశేఖరే స్వయంగా పార్టీ అధిష్టాన నాయకులను నిలదీసారని నాగార్జున గుర్తు చేసారు. ఎనర్జీ అసిస్టెంట్‌ల నియామకాలు పొందిన వారి సర్టిఫికేట్‌లు లక్నోలోని పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య విద్యాపీఠ్‌ నుండి వచ్చిన వాటికి, తమకు ఎటువంటి సంబంధం లేదని ఆ సంస్థ విజిలెన్స్‌ అధికారులకు రాత పూర్వకంగా ఇచ్చారని అన్నారు. ఇలాంటి దొంగ సర్టిఫికేట్లుతో ఉద్యోగాలలో చేరిన వారిని ఏవిధంగా రెగ్యులర్‌ చేయాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారనిప్రశ్నించారు. జూనియర్‌ లైన్‌మెన్లు తమ హక్కులకోసం న్యాయమైన పోరాటం చేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని నాగార్జున కోరారు. కార్య క్రమంలో చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు రౌతు కామునాయుడు, టిడిపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పైల బలరాం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దన్నాన రామచంద్రుడు, బిసి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ముల్లు రమణ, మెరకముడిదాం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కెంగువ ధనుంజయతో పాటు నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.

అధికారంలోనికి వచ్చిన 100 రోజుల్లో ఆర్‌ఇసియస్‌ పునరుద్దరణ

టిడిపి అధికారంలోనికి వచ్చిన 100 రోజుల్లోనే తిరిగి ఆర్‌ఇసియస్‌ను పునరుద్దరిస్తామని మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు అన్నారు. స్థానిక నటరాజ్‌ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ఆర్‌ఇసియస్‌ను అధికార వైసిపి పార్టీ బోర్డులో విలీనం చేయడం వలన ఈ ప్రాంత ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టిడిపిలో చేరిన తాను చంద్రబాబునాయుడు ఏ పని అప్పజెప్పితే ఆ పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. టిడిపి అధికారంలోనికి వచ్చిన వెంటనే తోటపల్లి కాలువకు సంబంధించి పిల్ల కాలువలను చెరువులకు అనుసంధానం చేసే బాధ్యత తీసుకొని రైతులకు సకాలంలో నీరందిస్తానని తెలిపారు.

➡️