నిర్లక్ష్యం నీడలో ఆర్వో ప్లాంట్‌

ప్రజాశక్తి-సిఎస్‌పురం రూరల్‌: మండలంలోని ఏ కొత్తపల్లి గ్రామంలో మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను బాగు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గ్రామస్తులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఏ కొత్తపల్లి గ్రామప్రజలకు ఫ్లోరిన్‌ రహిత తాగునీటిని అందించేందుకు 2017 ప్రాంతంలో అప్పటి టిడిపి ప్రభుత్వ పాలనలో రూ.7 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే కదిరి బాబురావు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే రెండేళ్ల క్రితం ఈ ఆర్వో ప్లాంట్‌ మరమ్మతులకు గురైంది. ఈ ఆర్వో ప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టక పోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొద్దిమంది గ్రామస్తులు గ్రామంలో ఉన్న ప్రైవేటు వారి ఆర్వో ప్లాంట్‌ వద్ద నీళ్లు కొనుగోలు చేసి తాగుతుండగా, మరి కొద్దిమంది డీప్‌ బోర్‌ ద్వారా వచ్చే నీటిని తాగుతూ సరిపెట్టుకుంటున్నారు. ఫ్లోరిన్‌ రహిత నీటిని అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్‌కు మరమ్మతులు చేయించి ఫ్లోరిన్‌ రహిత నీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రమేష్‌ను ప్రజాశక్తి వివరణ కోరగా ఆ ఆర్వో ప్లాంట్‌ను పంచాయతీ వారికి అప్పగించామని, వారు మరమ్మతులు చేయించుకోవాల్సి ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్యను ప్రజాశక్తి వివరణ కోరగా మరమ్మతులకు దాదాపు లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చిన్న పంచాయతీ అయినందున అంత నగదు పంచాయతీలో లేకపోవడంతో మరమ్మతులు చేయించలేక పోయామన్నారు.

➡️