నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలలో సిద్ధంగా ఉండాలన్నారు. ఫారం 6, ఎంసిసి, ఇఎస్‌ఎంఎస్‌, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి తదితర అంశాలకు సంబంధించిన నివేదికలను ప్రతిరోజు సిఇఒ కార్యాలయానికి తగిన సమయంలో చేరవేయాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందజేయాలని తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించరాదని నోడల్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో ఎన్నికల విధులలో ఉన్న నోడల్‌ అధికారులు, ఎలక్షన్‌ సెల్‌ అధికారులు పాల్గొన్నారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సద్వినియోగం చేసుకోండి ఎన్నికల ఫిర్యాదులు, ఇతర వివరాల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబరును (1800 425 7090) సద్వినియోగం చేసుకోవాలని అభిషిక్త్‌ కిషోర్‌ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, ఇతర వివరాల కొరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎటువంటి ఫిర్యాదునైనా ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఫిర్యాదుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950కి అదనంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

➡️