నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఈ నెల 27, 28, 29 తేదీల్లో స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలకు కాకినాడ ముస్తాబైంది. సభలు జరగనున్న ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు నగర్‌, ధీరజ్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు.మహాసభల సందర్భంగా నగరంలోని పలు కూడళ్లలో ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు, బ్యానర్లు, తోరణాలతో అలంకరించారు. మెయిన్‌ రహదారుల వెంబడి హోర్డింగులు ఏర్పాటు చేశారు. వాల్‌ పెయింటింగ్స్‌ ద్వారా ప్రచారం చేపట్టారు. ఇలా మహాసభలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కమిటీ నాయకులు తెలిపారు. 26 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొని విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నారు.మొదటిరోజు బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాను ఆవిష్కరించి రాష్ట్ర మహాసభలను ప్రారంభిస్తారు. అనంతరం అమర వీరులైన అల్లూరి సీతారామరాజు, ధీరజ్‌, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి, మల్లు స్వరాజ్యం తదితరుల అమరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం 24వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు జెఎన్‌టియుకె విసి ప్రొఫెసర్‌ జివిఆర్‌ ప్రసాద్‌ రాజు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావులు ప్రారంభ సభలో ప్రసంగిస్తారు. పిడిఎఫ్‌ మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం ముఖ్య వక్తగా మాట్లాడతారు. అనంతరం రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో జరిగిన విద్యార్థి ఉద్యమాలపై రాష్ట్ర కార్యదర్శి నివేదిక ప్రవేశపెడతారు. అన్ని జిల్లాల వారీగా ప్రతినిధులు గ్రూపు చర్చల్లో పాల్గొంటారు.రెండో రోజు విద్యార్థులు, గిరిజనులు, సోషల్‌ మీడియా, సంక్షేమ హాస్టళ్లు, కేంద్రీకరించిన కళాశాలలు, కమిటీలు వంటి రంగాల వారీగా మహాసభల్లో చర్చలు జరుగుతాయి. ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు ముఖ్య వక్తగా పాల్గొంటారు. మూడో రోజు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడంతో బాటు భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆనంద భారతి గ్రౌండ్‌ నుంచి మెక్లారిన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ వరకు విద్యార్థి కవాతు, 5 వేల మందితో భారీ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులతో సాంస్కతిక ప్రదర్శనలు ఉంటాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర, అఖిలభారత నాయకులు విద్యారంగ సమస్యలపై మాట్లాడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వివరిస్తారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల కలిగే నష్టాలపై మాట్లాడతారు.

➡️