నేటి నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

Feb 29,2024 23:18

గుంటూరు ప్రభుత్వ మహిళా కాలేజీలో రోల్‌ నంబర్లు పరిశీలిస్తున్న ఆర్‌ఐఒ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. ఉదయం 8.30 గంటల నుండే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమ తిస్తారు. ఈ ఏడాది విద్యార్థులు పరీక్ష సమయం ముగిసే వరకూ పరీక్ష హాల్లోనే ఉండాల్సి ఉంటుందని, పరీక్ష అయిపోతే మధ్యలో బయటకు రావటానికి అవకాశం లేదని ఆర్‌ఐఒ తెలిపారు. జిల్లాలో 92 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు జరగుతున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 30,820 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1010 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 26,573 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1032 మంది మొత్తం 59,438 మంది హాజరవుతున్నారు. యాజమాన్యాలు ఎవరైనా హాల్‌ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే అటువంటి వారు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ బోర్డు కల్పించింది. ఆ విధంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టిక్కెట్‌పై ప్రిన్సిపాల్‌ ధ్రువీకరణ సంతకం కూడా అవసరం లేదని బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేయటానికి ఆర్‌ఒఐ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 7815968897, 0863-2228528 నంబర్లకు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. నాలుగు ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌లు ఏర్పాటు చేశారు.

➡️