నేటి సాయంత్రానికి ప్రాథమిక నివేదిక

Jan 31,2024 00:29

ప్రజాశక్తి – దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. ప్రమాదంపై విచారణ కోసం తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 11 మంది అధికారులతో కమిటీని ప్రభుత్వం నియమించగా వారు ఘటనాస్థలికి వచ్చారు. కోల్డ్‌ స్టోరేజ్‌ కార్యాలయంలోని పత్రాలను పరిశీలించిన అనంతరం ఆయా శాఖలకు సంబంధించి ప్రాథమిక నివేదికలను బుధవారం సాయంత్రానికి రూపొందించాలని సబ్‌ కలెక్టర్‌ ఆదేశించారు. కమిటీలోని 11 మంది అధికారులతో ఒక వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపర్చానలి చెప్పారు. స్టాకు వివరాలు, బీమా, బ్యాంకింగ్‌, ప్రమాద వివరాలు, లైసెన్సు, అగ్రిమెంట్‌, కండిషన్‌ సమస్యలు తదితర అంశాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు.అనంతరం రైతుల కోరిక మేరకు స్థానిక వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డులో రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. సమస్యను అడిగి తెలుసుకుని అర్జీల రూపంలోనూ తీసుకున్నారు. రైతులు ప్రస్తావించిన అంశాలు, సమస్యలనూ నివేదికలో పొందుపరుస్తామని సబ్‌కలెక్టర్‌ చెప్పారు. విచారణ కమిటీలో గుంటూరు నార్త్‌ జోన్‌ డీఎస్పీ జె.రాంబాబు, అగ్నిమాపక దళ జిల్లా అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, వాణిజ్య పంటల జిల్లా అధికారి బి.రవీంద్రబాబు, మార్కెటింగ్‌ శాఖాధికారి బి.రాజబాబు, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్‌ మేనేజర్‌ ఎం.మదన్మోహన్‌శెట్టి, పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఎ.గాయత్రిదేవి, లీడ్‌ బ్య్‌ాం డిప్యూటీ మేనేజర్‌ ఎ.మహిపాల్‌రెడ్డి, నాబార్డు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శరత్‌ ఉన్నారు.
పలు పత్రాలు స్వాధీనం
ఇదిలా ఉండగా కోల్డ్‌ స్టోరేజ్‌కి సంబంధించిన కొన్ని రికార్డులను స్టోరేజీ కార్యాలయంలో తహశీల్దార్‌ కె.మల్లీశ్వరి, వ్యవసాయ మార్కెటింగ్‌ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ ఎన్‌.శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. వాటిని తమ సిబ్బంది ద్వారా స్థానిక ట్రెజరీ కార్యాలయానికి తరలించి ఎస్‌టిఒ షేక్‌ మస్తాన్‌ గుంషా వలి సమక్షంలో సీల్‌ వేసి భద్రపరిచారు.

➡️