నేడు ఎసిసి కార్మికుల ఆకలి పోరుయాత్ర

Mar 10,2024 23:34

వివరాలు చెబుతున్న కార్మికులు
ప్రజాశక్తి-తాడేపల్లి:
ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం ఆకలి పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు యూనియన్‌ నాయకులు కె.స్టీవెన్‌, ఎ.కోటేశ్వరరావు, వై.యొహోషవా, డి.గురవారావు, వి.సుర్యప్రకాష్‌, ఎస్‌.బెనర్జీ తెలిపారు. ఆదివారం సిమెంటు ఫాక్టరీ యూనియన్‌ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ మూతబడి 30 సంవత్సరాలు గడుస్తున్నా అనేక ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు మాత్రం తీరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు విలువ గల కంపెనీకి చెందిన భూముల్లో 10 శాతం భూములు అమ్మినా కార్మికులకు నష్టపరిహారం ఇవ్వవచ్చని చెప్పారు. రాజకీయ పార్టీల ముసుగులో బడా పెట్టుబడిదారులు భూములను కాజేయడానికి కుట్ర పన్నారని విమర్శించారు. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఎసిసి భూములను రెవెన్యూ రికవరీ ద్వారా కార్మికులకు బకాయిలు చెల్లించాలని ఆర్డర్‌ ఇచ్చినా అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు యూనియన్‌ కార్యాలయం నుండి ఎంఆర్‌ఒ కార్యాలయం వరకు ఆకలి పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాజమాన్యానికి లాభాలు చేకూర్చిన కార్మికులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ముందుకు రావాలని కోరారు.

➡️