న్యాయం చేయకుంటే లావాదేవీలను అడ్డుకుంటాం

Feb 13,2024 23:22

వినతిపత్రం ఇస్తున్న బాధిత రైతులు, నాయకులు
ప్రజాశక్తి – క్రోసూరు :
మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అప్రైజర్‌గా పని చేసిన నాగార్జున కొద్ది నెలల కిందట మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బంగారాన్ని కోల్పోయిన బాధిత రైతుల సమావేశం బ్యాంకు వద్ద మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ బ్యాంకులో బంగారం కనిపించకుండా పోయి 8 నెలలైనా బ్యాంకు క్రింది స్థాయి అధికారులు, పైస్థాయి అధికారులు చెప్పే మాటలకు పొంతనే ఉండడం లేదని అన్నారు. ఈ విషయంపై వివిధ స్థాయిల్లో అధికారులను అనేకసార్లు కలిసినా రైతులకు న్యాయం చేయడం లేదని, కనీసం హామీ ఇవ్వడం లేదని విమర్శించారు. గతేడాది అక్టోబర్‌లో రీజనల్‌ మేనేజర్‌ స్థానిక బ్యాంకు వద్దకు వచ్చి బాధిత రైతులతో మాట్లాడారని, మూణ్ణెల్లలో సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా రైతులకు బంగారం అందించలేదని చెప్పారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు సరైన చర్యలు తీసుకోకుంటే బాధితుల కలిసి బ్యాంకు వద్ద ఆందోళనకు పూనుకుంటామని, సమస్యను పరిష్కరించే వరకూ బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, ఎం.రామకష్ణారెడ్డి, ఎస్‌కె.కరిముల్లా, ఐ.రాంబాబు, ఎ.బాణికిషోర్‌, కెఆర్‌.బాజివాలి, ఎస్‌కె.నాగుల్‌ షరీఫ్‌, జి.వెంకటరమణ, జె.శ్రీధర్‌బాబు, పి.సాంబశివరావు కె.వీరమ్మ, ఎ.బాజీ, ఎస్‌కె.రవుఫ్‌, జి.బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️