పంట, ఆస్తి నష్టాల గణన వేగవంతం

పంట, ఆస్తి నష్టాల గణన వేగవంతం

ప్రజాశక్తి-కాకినాడ తుపాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు, పంట, ఆస్తిని నష్టాల గణన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా కతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తుపాను అనంతర పరిణామాలపై తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశుసంవర్థక, పౌల్ట్రీ, మత్స్య రంగాలు, రోడ్లు భవనాలు, విద్యుత్‌ సరఫరా, ఇరిగేషన్‌, డ్రైయిన్ల తదితర వ్యవస్థలకు జరిగిన నష్టం అంచనాలు, తాత్కాలిక, శాశ్వత పునరుద్దరణకు ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి అమరావతి నుంచి తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, జెసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లాలో తుఫాను కారణంగా 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలోలో వరి పంటలు నేల కొరిగాయని, 7 వేల హెక్టార్లలో పంటలు ముంపునకు లోనైయ్యాయని కలెక్టర్‌ సిఎస్‌కు వివరించారు. 726 హెక్టార్లలో ఉద్యాన పంటలు ప్రభావితమైయ్యాయని, ఇందులో 309 హెక్టార్లలో కూరగాయ పంటలు, 225 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు. కాకినాడ డివిజన్‌లో 102, పెద్దాపురం డివిజన్లో 170, వెరసి జిల్లాలో 272 ఇళ్లకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తుపాను భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయని, ఉధతి తగ్గిన వెంటనే ఈ నెల 11 నుంచి నష్టాల ఎన్యూమరేషన్‌ నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఎన్‌.విజరు కుమార్‌, పశుసంవర్థక శాఖ జేడీ ఎస్‌.సూర్యప్రకాశరావు, మత్స్య శాఖ జేడీ పి.సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ హరిప్రసాద్‌బాబు, ఎపిఇపిడిసిఎల్‌ ఇఇ ప్రసాద్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు, పెద్దాపురం డివిజన్‌ ఇఇ రామ్‌గోపాల్‌, డ్రైయిన్స్‌ ఇఇ కె.ఏడుకొండలు, డిఎస్‌ఒ ఎంవి.ప్రసాద్‌, ఆర్‌డిఒలు ఇట్ల కిషోర్‌, జె.సీతారామారావు, అధికారులు పాల్గొన్నారు.

➡️