పంట రక్షణపై రైతులకు అవగాహన

పంట రక్షణకు రైతులకు సూచనలు చేస్తున్న వ్యవసాయాధికారి రమేష్‌నాయుడు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు దెబ్బతినే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పంట రక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారి రమేష్‌ నాయుడు మండలంలోని పలు పంట పొలాలను సందర్శించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే కోసిన వరి చేను కుప్పలు వేసుకొని వాటిపై తార్ఫాలిన్లు కప్పుకోవాలన్నారు. కోసిన వరి పనలు నీట మునిగిన మడుల్లో నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ వరి పనలు నీట మునిగి మొక్క వచ్చినట్లయితే 5శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యం తేమశాతం ఎలా ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వ సూచన మేరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కె ప్రదీప్‌ కుమార్‌, పి రామరాజు, పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️