పండగకి ఉద్యోగస్తులను పస్తులు పెడుతున్న ప్రభుత్వం

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు నాగజగదీష్‌

ప్రజాశక్తి- అనకాపల్లి

ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మొండి వైఖరితో ఉద్యోగస్తులను పండగ పూట పస్తులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల అహంకార పూర్వకంగా వ్యవహరిస్తూ, నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగుల పట్ల నీచంగా మాట్లాడడం వైసిపి పెత్తందారి వ్యవస్థకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని హామీ ఇచ్చి, నేడు మోసం చేయడం దారుణమన్నారు. అంగన్వాడీలు నెల రోజులుగా సమ్మె చేస్తుండగా, సమస్యలను పరిష్కరించకపోగా సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సకల శాఖ మంత్రి సజ్జల ఉద్యోగులను బెదిరించడం దారుణమన్నారు. జీతాలు పెంచే సమస్య లేదని వారిని రెచ్చగొడుతున్నారన్నారు. జీతాలు బకాయిల గురించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టారని, అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పంచాయతీరాజ్‌ కార్మికులకు ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయవలసిన సరుకులు కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు. ఇటువంటి ప్రభుత్వ చర్యలను ప్రజలు ఉద్యోగులు అందరూ గమనించి వైసీపీని సాగనంపడానికి నిర్ణయించుకున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు మల్ల గణేష్‌, కోట్ని రామకృష్ణ పాల్గొన్నారు.

➡️