పకడ్బందీగా ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు

Feb 7,2024 00:03

అధికారులతో సమీక్షిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
వచ్చే నెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు, 19వ తేదీ నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో వాటిని పాదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. అదేవిధంగా ఈనెల 11 నుంచి 20 వరకు 84 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం నరసరావుపేటలోని కలెక్టర్‌ ఛాంబర్‌ నుండి ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్‌ కమిషనర్లు వివిధ శాఖల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌళిక వసతులను ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండే చూడాలని, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స కేంద్రాలను ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు 48 సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 30,180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు 127 సెంటర్లలో నిర్వహిస్తుండగా 29244 మంది హాజరవుతారని తెలిపారు. ప్రశ్నాపత్రాలను ఆన్సర్‌ షీట్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను పటిష్టంగా ఉంచాలన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు ఉండకుండా చూడాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు సమాచారాన్ని అందించేలా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అందులో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, విద్యాశాఖ సంబంధించి శాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️