పగబట్టిన ప్రకృతి

Dec 9,2023 20:43

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  మన్యంలో గత నాలుగేళ్లుగా ప్రకృతి గిరిజన రైతులపై పగబట్టింది. ఏదో ఒక రూపంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగించి రైతులను కష్టాల పాలు చేస్తుంది. ఈ ఏడాది వర్షభావ పరిస్థితులు వల్ల గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో వరి పంటకు నష్టం వాటిల్లడంతో కరువు ఛాయలు అలమకున్నాయి. జీడిపంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గిరిజనులకు కారు మబ్బులతో జీడిపంట దిగుబడి కానరావడం లేదు. మైదాన ప్రాంతాలైన జియమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో తుపాను కారణంగా వరి, పత్తి పంటల్లో నీరు చేరడంతో అవి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. వీటికి తోడు అడవి ఏనుగుల సంచారంతో వరి, అరటి, పత్తి ,మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తు న్నాయి. ప్రతి ఏడాది పంటల మదుపులకు వేలాది రూపాయలు అప్పులు చేస్తున్నా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఏడాదంతా కష్టపడి సాగు చేసిన పంట చేతికి అంద డంలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.జీడి పంట ఆదుకునేనా?పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 50,472 ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. ఒక్క గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోనే సుమారు 35వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. ప్రతి ఏటా 10వేల నుంచి 12వేల క్వింటాళ్ల వరకు జీడి పంట దిగుబడి వస్తుందని అంచనా. అయితే గత నాలుగేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు కారణంగా పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏటా చెట్లు పూతకు వచ్చే డిసెంబర్‌ నెలలోనే అధికంగా టీదోమ ఆశిస్తుంది. ఉద్యాన శాఖ అధికారులు ముందుగానే రైతులకు తెగుళ్లపై అవగాహనా కల్పించి సస్యరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అది ఎక్కడ కానరావడం లేదు. ఫిబ్రవరి, మార్చిలో గుర్తించండంతో పంటపై తీవ్ర ప్రభావం చూపి పూత, పిందె నిలబడకుండా పంటను సర్వనాశనం చేస్తున్నాయి. 1990 నుంచి 2015 వరకు ఐటిడిఎ, హార్టికల్చర్‌ ద్వారా 90 శాతం రాయితీపై కొమ్మలు కత్తిరించే పరికరాలు, మందులు, స్ప్రేయర్లు అందించేవారు. ప్రస్తుతం ఎలాంటి రాయితీలు లేకపోవడంతో భారం పడుతుందని గిరిజనులు రైతులు వాపోతున్నారు. గిరిజన రైతులు పండించే జీడి పంటకు మద్దతు ధర కల్పించేందుకు గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, సాలూరు, మక్కువ మండలాల్లో రూ.6 లక్షలు చొప్పున వెచ్చించి జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. రూ.2 లక్షలు ఖర్చుతో ఆయా కేంద్రాలకు సామాగ్రి కొనుగోలు చేశారు.  నాటి నుంచి నేటి వరకు ఎక్కడా కేంద్రాలను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో జీడి పంటను రైతులు ప్రైవేటు వర్తకులకు అమ్ముకోవాల్సి వస్తుంది. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. గత ఏడాది గుమ్మలక్ష్మీపురం మండలం జెకె పాడులో జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభానికి అధికారులు సన్నాహాలు చేసినా అది నోచుకోలేదు.

తీవ్రంగా నష్టపోతున్నారు

జీడి పంట పూత సమయంలో ఎక్కువగా తేనెమంచు ప్రభావం, టీ దోమ సోకడంతో గత మూడేళ్ల నుంచి పంట దిగుబడి బాగా తగ్గింది. ప్రధాన పంట అయిన జీడి పంటనే నమ్ముకుని వేలాదిమంది రైతులు జీవనం సాగిస్తున్నారు. పంట దిగుబడి ఆశించిన ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఐటిడిఎ అధికారులు గుర్తించి రైతులకు సబ్సిడీపై క్రిమిసంహారక మందులు పంపిణీ చేయాలి.

మండంగి రమణ, ఎంపిటిసి, చెముడుగూడ.

నష్టపరిహారం ఇవ్వాలి

ఈ ఏడాది కరువు ప్రభావంతో వరి పంట నష్టపోయిన గిరిజన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలి. ప్రధాన ఆధారమైన జీడి పంటను ప్రోత్సహించి, జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు తెరిచి గిరిజనులకు ఉపాధి కల్పించాలి. వ్యవసాయ యాజమాన్య పద్ధతుల్లో జీడి పంటలపై అవగాహన కల్పించాలి.

కోలక అవినాష్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి.

రైతులను ఆదుకోవాలి

వరితో పాటు ఇతర పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. నష్టాలపై సర్వే చేసి పరిహారం చెల్లించాలి. జీడి పంట రైతులకు తెగుళ్లు నివారణపై అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వాలి.

నందివాడ కృష్ణబాబు, టిడిపి అరుకు పార్లమెంటరీ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి

➡️