పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ధి అందించడంలో భాగంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి కలెక్టర్‌ గిరీష, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, జిఎస్‌డబ్ల్యుఎస్‌ఒ మనోహర్‌ రాజు, డ్వామా పీడీ మద్దిలేటి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలన్నారు. నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులైన వారందరికీ నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అన్నమయ్య జిల్లాలో 15,802 మంది లబ్ధిదారులకు గాను రూ.615.93 కోట్ల లబ్ధి చేకూరడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ అన్నమయ్య జిల్లాలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా 26 మంది లబ్ధిదారులకు రూ.6.24 లక్షలు, వైయస్సార్‌ ఇబిసి నేస్తం ద్వారా 190 మందికి రూ.28.50 లక్షలు, జగనన్న చేదోడు ద్వారా 470 మందికి రూ.47.00 లక్షలు, జగనన్న అమ్మఒడి ద్వారా 2480 మందికి రూ.352.99 లక్షలు, వైయస్సార్‌ వాహన మిత్ర ద్వారా 155 మందికి రూ.22.30 లక్షలు, వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు ద్వారా 62 మందికి రూ.53.90 లక్షలు, వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 58 మందికి రూ.8.70 లక్షలు లబ్ధి చేకూరడం జరిగిందన్నారు.ఇందులో రైస్‌ కార్స్‌ 479 మందికి, ఆరోగ్యశ్రీ కార్డులు 2149 మందికి, హౌస్‌ సైట్‌ పట్టాలు 2923 మందికి, పెన్షన్‌ కార్డులు 3210 మందికి ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులైన 15,802 మందికి రు.615.93 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు.

➡️