చివ‌రి ప‌రీక్ష రాసి.. ఆఖ‌రి ఊపిరి విడిచి..

Mar 27,2024 22:49

చిన్నారి మృతదేహం.. ఇన్‌సెట్‌లో మృతురాలు చిన్నారి (ఫైల్‌)
ప్రజాశక్తి – క్రోసూరు :
అనారోగ్యాన్ని సైతం తట్టుకుని ఎలాగోలా పదో తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థిని ఆఖరి పరీక్ష రాసిన కొద్ది నిముషాల్లోనే మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో బుధవారం జరిగిన ఘటనపై వివరాల ప్రకారం.. క్రోసూరు మండలం నాగవరానికి చెందిన చిలక కరుణమ్మ, సుబ్బయ్య దంపతులకు ఏకైక బిడ్డ అయిన చిన్నారి (15) స్థానిక జెడ్‌పి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్ష కేంద్రాన్ని సత్తెనపల్లి మండలం భృగబండలో కేటాయించారు. పాఠశాల నుండి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయగా ప్రతిరోజూ అదే బస్సులో చిన్నారి పరీక్షలకు వెళ్లి వస్తున్నారు. రెండ్రోజులుగా చిన్నారికి జ్వరం వస్తున్నా పరీక్షకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పరీక్ష రాసిన అనంతరం నీరసంగా ఉండడంతో గమనించిన ఉపాధ్యాయులు బుధవారం పరీక్షకు విద్యార్థినితోపాటు రావాలని చిన్నారి తల్లి కరుణమ్మతో చెప్పారు. దీంతో ఆమెకూడా బుధవారం చిన్నారితో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చారు. పరీక్ష అనంతరం బయటకు వచ్చిన చిన్నారి ఆయాసంగా ఉందని తల్లికి చెప్పడంతో ఆమె బంధువులను పిలిపించి బైక్‌పై రెడ్డిగూడెంలోని ఒ ఆర్‌ఎంపి వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉందని, సత్తెనపల్లికి తీసుకెళ్లాలని ఆయన సూచించడంతో బైక్‌ మీదే సత్తెనపల్లికి బయలుదేరారు. అయితే మార్గంమధ్యలోనే చిన్నారి మృతి చెందడంతో మృతదేహాన్ని నేరుగా నాగవరంలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఉన్న ఏకైక కుమార్తె మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. మృతురాలి గుండెకు చిన్న రంద్రం ఉందని, పెద్దయ్యాక ఆపరేషన్‌ చేయించాలని చిన్నప్పుడు వైద్యులు చెప్పారని, డబ్బుల్లేక ఇప్పటి వరకూ చేయించలేదని, పరీక్షల తర్వాత చేయిద్దామని అనుకుంటే ఇప్పుడిలా అయ్యిందని తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు.

➡️