పల్నాడులో ఇండో ఇజ్రాయిల్‌ ప్రాజెక్టు

శంకుస్థాపన చేస్తున్న మంత్రులు, ఇజ్రాయిల్‌ రాయబారి
ప్రజాశక్తి – నకరికల్లు : మండలంలోని బాలాజీ నగర్‌ తండా వద్ద 25.57 ఎకరాలో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఇండో-ఇజ్రాయిల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను (సమర్థత కేంద్రం) మంత్రులు, ఎంపీ, ఇజ్రాయిల్‌ ప్రతినిధులు బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఇజ్రాయిల్‌ రాయబారి నూరి గొలిన్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌, మిర్చిలోని సుమారు 25 రకాల వంగడాల ప్రదర్శనను వారు పరిశీలించారు. అనంతరం మంత్రి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తయ్యే పంటల్లో ఏపీ వాటా 15 శాతమన్నారు. రాష్ట్రంలో 40265 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 139 ఎకరాల్లో అపరాలు సాగవుతున్నాయని, ఆధునిక శాస్త్ర సాంకేతిక విధానాల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించడం కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పని చేస్తుందని చెప్పారు. ఇజ్రాయిల్‌ దేశంలో చాలా చిన్నదైనా, నీటి కొరత ఎక్కువే అయినా ఆధునిక సాంకేతికత ద్వారా అధిక దిగుబడులు పొందుతున్నారని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నకరికల్లు మండలంలో సమర్థత కేంద్రం ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఒక వరమన్నారు. రాష్ట్రంలో ఇది రెండవ కేంద్రమని చెప్పారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయ మాట్లాడుతూ గతంలో రైతులు వర్షాల్లేక నీళ్ల కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, అటువంటి శ్రమ లేకుండా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా ఇండో ఇజ్రాయిల్‌ ప్రాజెక్టు పల్నాడు ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ఇజ్రాయిల్‌ రాయబారి నూరి గిలోన్‌ మాట్లాడుతూ భారత్‌ ఇజ్రాయిల్‌ సంబంధాలు కొనసాగాలని, రానున్న రోజుల్లో మరో 14 కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్‌ శ్రీధర్‌బాబు, పల్నాడుజిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, ఉద్యాన శాఖ పల్నాడు జిల్లా అధికారి బేన్నీ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సాయిమార్కొండరెడ్డి పాల్గొన్నారు.

➡️