పారదర్శకంగా కులగణన సర్వే

ప్రజాశక్తి-వెలిగండ్ల: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కులగణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా జడ్‌పిటిసిల సంఘం అధ్యక్షుడు వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి మండలంలో జరిగే కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్‌, మండల స్థాయి అధికారులు, కులగణనలో పాల్గొనేవారు ఈ సర్వే పూర్తయ్యే వరకు మొబైల్‌ ఫోన్లు మార్చవద్దని కోరారు. సమాచారం ఇతరులకు షేర్‌ చేయవద్దని అన్నారు. ఈ సర్వేపై మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి తాతపూడి సుకుమార్‌ సచివాలయ సిబ్బందికి, మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షురాలు రామన మహాలక్ష్మి, తహశీల్దారు ఎన్‌ వాసు, మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతిరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకుడు నాగూర్‌యాదవ్‌, సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

➡️