పింఛన్లు సౌకర్యవంతంగా ఇవ్వాలి : సిపిఎం

Apr 1,2024 21:14

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: వృద్ధాప్య, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత కార్మిక, మత్స్యకార, లింగమార్పిడి, డప్పు కళాకారుల పింఛన్లు ఇబ్బంది లేకుండా, రాజకీయ పార్టీల ప్రయోజనం లేకుండా ఇవ్వాలని పట్టణ సిపిఎం కార్యదర్శి గొర్లి వెంకటరమణ, నాయకులు పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు, వ్యాధిగ్రస్తులై మంచంపై ఉన్న వారికి ఏ ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇవ్వాలన్నారు. ఎన్నికల నిబంధనలో భాగంగా ఆందోళన చెందుతున్న పింఛనుదారులకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. దీనికి కమిషనర్‌ స్పందిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి పింఛనుదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిధులు లేకనే పింఛన్లపై వైసిపి దుష్ప్రచారం : టిడిపిగుమ్మలక్ష్మీపురం: సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణమని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం సాయంత్రం ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఖజానాలో నిధులు లేక వైసిపి టిడిపి పింఛన్లు ఆపేసిందని దుష్ప్రచారం చేస్తోందన్నారు. పింఛన్ల పంపకానికి చంద్రబాబుకు, ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదన్నారు. కేవలం నిధులు లేకనే పింఛన్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధ ప్రాతిపదికన పింఛన్లు ఇంటింటికీ పంపిణీ చేయవచ్చునన్నారు.ఇంటికి వెళ్లి పింఛను అందించాలి కొమరాడ: సామాజిక పింఛన్లు విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరికీ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛన్‌ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి సోమవారం డిమాండ్‌ చేశారు. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు ఒకరిపై ఒకరు నిందులు వేసుకుంటూ పింఛనర్లకు సకాలంలో పింఛన్లు అందించడం లేదన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను అందుకునే వృద్ధులు, వికలాంగులు ఈ నెలా ఒకటో తేదీన పింఛను అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వివిధ శాఖల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️