పెద్దదోర్నాల మండలంలో దాహం కేకలు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల వేసవి రాకముందే పెద్దదోర్నాల మండలంలో దాహం కేకలు మొదలయ్యాయి. ప్రతి గ్రామంలోనూ డీప్‌బోర్లు మొరాయించాయి. భూగర్భ జలమట్టం పడిపోయింది. డీప్‌బోర్లను రీ బోరింగ్‌ చేయిస్తే నీళ్లు పడే అవకాశం ఉంది. అయినప్పటికీ సర్పంచ్‌ల దగ్గర నిధులు లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో వారు చేతులెత్తేశారు. దీంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిమీ దూరంలో ఉన్న పొలాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. పశు పోషకుల కష్టాలు చెప్పనలవి కావడం లేదు. ఏకంగా నీటి కోసమే ఒక మనిషిని కేటాయించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా పెద్దదోర్నాల, బొమ్మలాపురం, బోడేనాయక్‌ తండా, తిమ్మాపురం, కటకానిపల్లి, చింతల అగ్రహారం, నల్లగుంట్ల గూడెం, బలిజేపల్లి గూడెం, బయన్న గూడెం తదితర గ్రామాల్లో నీటి కష్టాలు అధికమయ్యాయి. అధికారులు, పాలకులు నీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో ప్రతిరోజూ మండలంలోని ఏదో ఒక గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో గల పాలుట్లలో నీటి కోసం చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది నల్లమల అటవీ ప్రాంతం కావడంతో విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదు. దీంతో 2016-17లో మంచినీరు, లైట్ల కోసం సుమారు రూ. మూడు కోట్లతో సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలుట్లలోని చెంచుగూడెం వరకు ఎనిమిది డీప్‌బోర్లు ఏర్పాటు చేసి ట్యాంకులు నిర్మించారు. సోలార్‌ సిస్టం ద్వారా నీటిని చెంచు గిరిజనులకు అందించారు. అయితే ఏడాది నుంచి నాలుగు సోలార్‌ సిస్టంతో నడిచే డీప్‌బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారింది. అరకొరగా వచ్చే మిగతా నాలుగు బోర్లపై 350 చెంచు కుటుంబాలు ఆధారపడాల్సి వచ్చింది. గత్యంతరం లేక కొందరు చెలమల్లో నీటిని తెచ్చుకొని వాడుకుంటున్నారు. వీటి ద్వారా మలేరియా, క్షయ, చర్మవ్యాధులు, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయినా వాడుకోక తప్పడం లేదని చెంచులు వాపోయారు. ఇప్పటికైనా ఐటిడిఏ అధికారులు స్పందించి మర్మమ్మతులకు గురైన నాలుగు సోలార్‌ సిస్టం డీప్‌బోర్లను బాగు చేయించాలని చెంచు గిరిజనులు కోరుతున్నారు.

➡️