పెన్షనర్ల నిరసన దీక్ష

ప్రజాశక్తి -కరాస: కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఎఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మర్రిపాలెం రీజనల్‌ పిఎఫ్‌ ఆఫీస్‌ వద్ద రిలే నిరసన దీక్షను సోమవారం ప్రారంభించారు. సోమవారం దీక్షలో హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ పెన్షనర్లు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి అసోసియేషన్‌ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.హుస్సేన్‌ మాట్లాడుతూ, 2008 సంవత్సరం నుంచి ఏటా ఢిల్లీలో ధర్నాలు చేస్తూ వినతి పత్రాలు అందజేసినప్పటికీ, పార్లమెంట్‌లో ఎంపీలు ప్రశ్నించినప్పటికీ పభుత్వంలో చలనం లేదన్నారు. ఇపిఎఫ్‌ 95 పెన్షనర్లు అతి తక్కువ పెన్షన్‌తో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదన్నారు. కనీస పెన్షన్‌ రూ.9 వేలతో పాటు డిఎ అనుసంధానం చేయాలని, భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ అందరికీ వర్తింపజేయాలని, రైల్వే రాయితిని పునరుద్దరించాలని డిమాండ్‌చేశారు. షిప్‌యార్డు ఉద్యోగులకు, పిఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.బాబూరావు, బిటి.మూర్తి, అప్పలరాజు, టి.భాస్కరరావు, కెపి.కుమార్‌, షిప్‌యార్డ్‌ విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️