పేద విద్యార్థులకు అండగా ‘రాయల్‌ క్లబ్‌’

ప్రజాశక్తి – మండవల్లి

పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించడంలో రాయల్‌ క్లబ్‌ ఎప్పుడు అండగా ఉంటుందని, విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ సీతాలాం రాంబాబు స్పష్టం చేశారు. మండలంలోని భైరవపట్నం శుభం ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన రాయల్‌ క్లబ్‌ కైకలూరు విద్యార్థుల స్కాలర్‌షిప్‌ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్రతిభ గల విద్యార్థులను రాయల్‌ క్లబ్‌ ఆఫ్‌ కైకలూరు ప్రోత్సహిస్తూ ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా రాయల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి కార్యక్రమాలతో పాటు మెడికల్‌ క్యాంపులు, అన్నదానాలు, వరద బాధితులను ఆదుకోవడం వంటి పలు సేవా కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన 24 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున లక్షా ఇరవై వేల రూపాయలను అందించారు. అనంతరం పదో తరగతి పాసై ఇంటర్మీడియట్‌, డిప్లమో, డిగ్రీ, బిటెక్‌ కోర్సులలో చదువుతున్న, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు దిశ నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాయల్‌ సర్వీసెస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పేటేటి పుల్లయ్య, కోశాధికారి గాజుల రామారావు, నేషనల్‌ రాయల్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుంకర కృష్ణ, రాయల్‌ క్లబ్‌ కైకలూరు అధ్యక్షులు ప్రొఫెసర్‌ సుధా, బత్తుల విజయకుమార్‌ పాల్గొన్నారు.

➡️