పేద విద్యార్థులకు ‘కెపా’ మెరిట్‌ స్కాలర్‌షిప్పులు

తెనాలిరూరల్‌: సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత సమా జంలో పతిఒక్కరిపైన ఉందని తులసీ సీడ్స్‌ అధినేత తులసి రామచంద్ర ప్రభు అన్నారు. కృష్ణ దేవరాయ ఎడ్యు కేషనల్‌ ప్రోగ్రెసివ్‌ అసోసియేషన్‌ (కెపా) 19వ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల పంపిణి కార్యక్రమం స్థానిక టీజీకే కళ్యాణమండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ సమాజాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత యువత భుజస్కంధాలపై ఉందని, విద్యార్ధుల భవిష్యత్తుతోనే దేశాభివృద్ధి ఆధార పడిందని అన్నారు. విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి రంగిశెట్టి మంగబాబు మాట్లాడుతూ విద్యార్ధి దశలోనే లక్ష్యాలు ఏర్పరుచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. కెపా అసోసియేషన్‌ ద్వార గత 19 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు మెరిట్‌ ఉపకార వేతనాలు అందిస్తున్నారని అన్నారు. సహృదయంతో ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్న దాతలవల్లే ఇది సాధ్యమైనట్లు చెప్పారు. ప్రియదర్శిని విద్యాసంస్థల అధినేత చందు రామారావు మాట్లాడుతూ విద్యార్ధులు జీవితంలో ఎదిగి సమాజం పట్ల తమవంతు బాధ్యతగా సేవ చేయాలన్నారు. అసోసియేషన్‌ ద్వారా ఆర్ధిక సహాయం పొంది స్థిరపడిన తమ కళాశాలల పూర్వ విద్యార్ధులు తిరిగి అసోసియేషన్‌ కు చేయూత నందించడం హర్షనీయమన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త అరవ రామకృష్ణ మాట్లాడుతూ చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్ధులకు సమాజం చేయూతనివ్వాలని కోరారు. కెపా అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యా యులు బొల్లిముంత వెంకట నారాయణ మాట్లాడుతూ 2002 సంవత్సరంలో 20 వేల రూపాయలతో ప్రారంభించి ఈ సంవత్సరంలో ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పీజీ చదువుతున్న 358 మంది మెరిట్‌ విద్యార్ధులకు రూ.11,18,680 ఉపకార వేత నంగా అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో ముందుగా కెపా సెక్రటరీ తాడికొండ చిన్నబ్బాయి వార్షిక నివేదిక సమర్పించారు. తకార్యక్రమంలో వివిధ అమెరికా ప్రోగ్రెస్సివ్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు చందు శ్రీనివాసరావు, విశ్రాంత కస్టమ్స్‌ అసిస్టంట్‌ కమిషనర్‌ బళ్ళ నరేంద్ర కుమార్‌, తెనాలి మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ తోట రాఘవరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ న్యూస్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బడే ప్రభాకర్‌, నారాయణ విద్యాసంస్థల ఏజీఎంకే వెంకటేశ్వరరావు విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు.

➡️